పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల వెనుక ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలిస్తే అమరావతి రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చిన భూముల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ, ఆ అమరావతి ప్రాంతం కూడా ఒక నందిగ్రామ్ ఘటనలాగా కాకూడదని కోరారు. కానీ కొన్ని పార్టీ నాయకులు ఆ మాటను వక్రీకరించి ప్రజల్లోకి మరో విధంగా అర్థమయ్యేలా పలుకులు పలికారు. అసలు నందిగ్రామ్ ఘటన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? నందిగ్రామ్ ఘటనకు, అమరావతి ఘటనకు గల సంబంధం ఏమైనా ఉందా? ఒకసారి తెలుసుకుందాం.
అది 2007 వ సంవత్సరం. అప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా బుద్ధదేబ్ భట్టాచార్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న నెపంతో కొన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావాలనుకున్నాడు. అందుకు రతన్ టాటాకు చెందిన నానో పరిశ్రమను సింగూరులో ప్రారంభించడానికి అనుమతి ఇచ్చాడు. కానీ అక్కడి భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేఖత వచ్చింది. ఆ రైతులు చేస్తున్న "సేవ్ ఫామ్‌ల్యాండ్" ఉద్యమానికి పర్యావరణవేత్తల సహాకారం, ప్రతిపక్ష నాయకురాలు మమతాబెనర్జీ తోడవ్వడంతో ఆ ఉద్యమం మరింత ఉధృతిగా సాగింది. చేసేది ఏమి లేక టాటా కంపెనీ వారు నిరుత్సాహపడి ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, మోడి ఆహ్వానం మేరకు గుజరాత్ రాష్ట్రంలో నానో పరిశ్రమ స్థాపించబడింది. ఈ భూ వివాదమై న్యాయ వ్యవస్థలు కలుగజేసుకుంటూ ప్రైవేటు ఆధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోవటానికి ఈ చట్టం నిబంధనలను కలిగి ఉంది, కాని ప్రైవేట్ వ్యాపారాలను అభివృద్ధి చేయటానికి కాదు అంటూ తీర్పునిచ్చాయి. టాటా మోటార్స్ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 997 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని 2016 లో సుప్రీంకోర్టు రద్దు చేసింది మరియు 9,117 మంది భూస్వాములకు తిరిగి ఇవ్వమని ఆదేశించింది.
ఇండోనేషియాకు చెందిన సలీం గ్రూప్ చేత నందిగ్రామ్ సెజ్‌లో రసాయన కేంద్రంగా ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించడంతో సెజ్ వివాదం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడార్ లోని నందిగ్రామ్ లో సలీం గ్రూప్స్ పరిశ్రమ వారికి సెజ్ లో 10వేల ఎకరాల భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ, ఇక్కడ కూడా స్థానికులు తమ భూమిని ఇవ్వమని ఖరాఖండిగా చెప్పారు. అప్పటికే భూములు సేకరించడంలో విఫలం అయిన ప్రభుత్వం ఈసారి ఎలాగైనా భూసమీకరణ చేయాలని మొండి పట్టుదల పట్టింది. రైతులంతా ఐక్యమత్యంగా 'భూమి రక్షా కమిటీ' గా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటాలు సాగించారు. 2007 జనవరి నుంచి మార్చి వరకూ నందిగ్రామ్ 'భూమి రక్షా కమిటీ' ఆధీనంలోనే ఉంది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఆ నందిగ్రామ్ లోకి రావాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి మధ్యలో ఆ నందిగ్రామ్ ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో పోలీసులకు, ప్రజలకు మధ్య ప్రతిఘటనలు జరిగాయి. ఈ పోలీసుల కాల్పుల ఘటనలో 14 మంది ప్రజలు దుర్మరణం చెందారు. సుమారుగా 100 మంది అదృశ్యమయ్యారు. ఈ సమస్య ఇంతటితో ఆగలేదు. కొన్ని నెలల పాటు ఆ నేల రక్తపాతంతో నిండిపోతూనే ఉంది. అదృశ్యమైన కొందరు కొన్ని నెలల తరువాత తిరిగి రావడంతో మళ్ళీ హింసకాండ పెరిగింది. స్థానిక రాజకీయ నాయకుల అండతో మరింత మరణకాండ సంభవించింది. ఈ పరిస్థితి రైతులు భూమిని కాపాడుకునే క్రమంలో ఒక ఉద్యమంగా సాగించి చివరకు ఒక యుద్ధ క్షేత్రంగా నిలిచింది. సుమారుగా 3500 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య 14 అని అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికి, సుమారుగా 50 మంది చనిపోయి ఉంటారని అనధికార లెక్కలు చెప్తున్నాయి. ఈ ఘటన ప్రధానంగా ప్రజలకు, అధికార పార్టీ కార్యకర్తల మధ్య సంభవించి తారా స్థాయికి చేరి హింస విపరీతంగా పెరిగింది. కొన్ని నెలలపాటు ఆ నేల రక్తసిత్తం అయింది. నందిగ్రామ్ ఘటన ఒక చేదు జ్ఞాపకంగా మిలిపోయింది. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పరిశ్రమను మరొక చోటకు తరలించడానికి అంగీకరించింది.
ఇపుడు ఉన్న ప్రభుత్వం గతంలో రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమికి సరైన న్యాయం జరగకపోతే, రైతుల ఆవేశం పెల్లుబికుతుందని అలాగే ఆ ఎలాంటి పరిణామాలు వస్తాయో ఊహించలేమని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అమరావతి రాజధానిగా రైతులు 3 పంటలు పండే భూమిని అప్పటి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇపుడు ఆ రాజధానిని తరలిస్తే రైతులు ఊరుకోరని, ప్రజలకు ఆ ఊహ వచ్చేలోపు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి మరో నందిగ్రామ్ కాకూడదని కోరుకుంటున్న అని చెప్పిన అంశాన్ని కొందరు నాయకులు ప్రజల్లోకి తప్పుడు భావంగా తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని అమరావతి రైతులకు తగిన న్యాయం చేయాలని ఆశిద్దాం.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com