దాడులు చేస్తే భయపడం … ఎదురు తిరుగుతాం
• చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదు
• పోయ గ్రామంలో వర్షంలోనే రైతులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• శ్రీ పవన్ కల్యాణ్ గారికి జనసేన, బీజేపీ శ్రేణుల ఘనస్వాగతం
• రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తిల్లో పూల వర్షం
చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుల జాగీరు ఏం కాదని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపైనా, పోలీసు వ్యవస్థపైనా గౌరవంతోనే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులపై ఇలాగే దాడులు కొనసాగితే మాత్రం సహించేది లేదని తిరగబడతామని తేల్చి చెప్పారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా శుక్రవారం భారీ వర్షంలో కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటన సాగిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ గ్రామంలో మాట్లాడారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “దాడులు చేస్తే భయపడే వ్యక్తిని కాదు. తిరిగి గొడవ పెట్టుకుంటాం. అయితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా సంయమనం పాటిస్తున్నాం. నివర్ తుపాన్ కారణంగా సర్వం కోల్పోయిన రైతులకు అండగా ఉండి, వారిలో భరోసా నింపేందుకే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర కల్పించాలనేదే జనసేన పార్టీ లక్ష్యం. అందు కోసమే జై కిసాన్ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. యువతను అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి. ఒక్క జనసేన పార్టీ మాత్రమే వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చూస్తోంద”ని అన్నారు.
• భారీ వర్షంలోనూ కొనసాగుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటన
చిత్తూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. భారీ వర్షంలోనూ దెబ్బ తిన్న రైతులకు భరోసా ఇచ్చేందుకు తిరుపతి నుంచి బయలుదేరి నెల్లూరు వైపు పయనం అయ్యారు. ఉదయం గం. 10.30 ప్రాంతంలో తిరుపతి నుంచి శ్రీ పవన్ కల్యాణ్ గారు బయలుదేరారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా ఆయన వెంట కదిలారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్ద జనసైనికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మీదుగా రైతులతో మాట్లాడేందుకు పోయ గ్రామానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేనతోపాటు బీజేపీ నాయకులు, శ్రేణులు కూడా శ్రీ పవన్ కల్యాణ్ గారికి హారతులిచ్చి పూలవర్షంతో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి దాటిన తర్వాత భారీ వర్షం మొదలయ్యింది. అప్పటికే శ్రీ పవన్ కల్యాణ్ గారి రాకకోసం పోయ గ్రామంలో రైతులు, పార్టీ శ్రేణులు వర్షంలో సైతం వేచిచూస్తుండడంతో ఆయన కూడా వర్షంలోనే వ్యాన్ మీదకి వచ్చి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.