అనంతపురం, (జనస్వరం) : ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తానని రైతాంగానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు విద్యుత్ కోతలతో మాట తప్పి కోతల ముఖ్యమంత్రిగా నిలిచారు. అనంతపురం జిల్లాలో కరెంటు కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఒకపక్క లోవోల్టేజీ సమస్య మరోపక్క పగలు కేవలం 5 గంటలు, రాత్రి పూట 4 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నా అది కూడా నాణ్యమైన కరెంటు సక్రమంగా ఇవ్వకుండా కోతలు విధిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా వీటికి 773 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం పగటిపూట 9 గంటల నిరంతరం సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నా, అది అమలుకు నోచుకోవడం లేదు. అధిక వర్షాలు కురిసి భూగర్భజలాలు పెరిగాయి. ఎండిన బోర్లు బావుల్లో నీరు చేరడంతో రైతులు పంటలు సాగు చేశారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు సమృద్ధిగా నీరు ఉన్నా విద్యుత్ సమస్య కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందారు. అనధికార కోతలతో విద్యుత్ సరఫరా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. వోల్టేజ్ కారణంగా పలు మండలాల్లో మోటార్లు కాలిపోతున్నాయి. వీటిని మరమత్తు చేయడానికి రైతులకు వేలల్లో ఖర్చు పెడుతున్నారు. మరోవైపు పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే కోతకొచ్చిన వేరుశనగ పంట, ఇతరత పంటలు అనధికార కోతల వల్ల దిగుబడి తగ్గుతుందని రైతులు భయపడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో 9గంటల నాణ్యమైన కరెంటు కోతలు లేకుండా ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జయరాం రెడ్డి అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com