నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 186వ రోజున 42వ డివిజన్ మన్సూర్ నగర్ లాల్ దర్గా ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు దారుణంగా మారాయన్నారు. 3 అంకణాలు కూడా లేని ఇళ్ళకు ఈ ప్రాంతంలో 20వేల నుండి 30వేల రూపాయల వరకు ఇంటి పన్నులు వేసి ఉన్నారని, ఎవరి సొంత ఇళ్లల్లో వారు బ్రతికేందుకు ప్రభుత్వానికి బాడుగ లాగా ఇంటి పన్నులు మారిపోయాయని దుయ్యబట్టారు. ఇంటి పన్నుకు తోడు కుళాయి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ అడ్డగోలు పన్నులు ఆగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, ఆ దిశగా ప్రజల ఆశీస్సులు కావాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.