Search
Close this search box.
Search
Close this search box.

ప్రతి నీటి బొట్టు .. బంగారమే పొదుపుగా వాడుకుందాం

                          నీటిని పొదుపుగా వాడేవారు ధనాన్ని కూడా పొదుపుగా వాడుతారట! నీటిని దుబారా చేసే వారు డబ్బును కూడా అలానే దుబారా చేస్తారట. ఈ భూమి మీద లభిస్తున్న మొత్తం నీటిలో 97 శాతానికి పైగా సముద్రజలం. అది ప్రాణులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేది కాదు. మరో రెండు శాతానికి పైగా మంచు రూపంలో ఉంది. మిగిలిన ఒక్క శాతంకన్నా తక్కువే ప్రాణులకు పనికివచ్చేది. అదే మంచినీరన్న మాట! ఇప్పుడా మంచినీటికి పెద్ద ముప్పు ఏర్పడింది. అధిక జనాభా తదితర వాస్తవాల వల్ల నీటి వినియోగం పెరిగి చాలీచాలని పరిస్థితి ఒకటైతే, దారుణమైన కాలుష్యం మరొకటి! వాతావరణం కాలుష్యం పెరిగి మంచుమీద ఒత్తిడి మొదలైంది. భూగోళం మీది సమతుల్యానికి మంచు కూడా ఒక ఆధారం. అది కాస్తా కరిగిపోతే, జలప్రళయం సంభవించి నేల తుడిచిపెట్టుకు పోతుంది. నీరే మన జీవనానికి ఆధారం. నదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత, సంస్కృతీ అభివృద్ధి చెందటం మనకు తెలిసిన విషయమే! నీరు మనకు ఆహారం. నీరే మనకు ఆధారం. రవాణా వ్యవస్థకు కూడా మనం నీటిని వాడుకుంటున్నాం. నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తున్నాం. రాబోయే కాలంలో వచ్చేవి ‘జలయుద్ధాలే’! ప్రకృతితో ఇకనైనా పరిహాసాలు ఆపేసి, ప్రకృతి వనరులను అతి పవిత్రంగా చూసుకోవటం నేటి మన తక్షణ కర్తవ్యం. అడవులను ఆక్రమించుకుంటున్నాం. స్మశానాలను ఆక్రమించుకుంటున్నాం. చెరువులు ఇతర జలాశయాలను నగరాల్లో ఎప్పుడో ఆక్రమించారు హిరణ్యాక్షుడివర ప్రసాదులు! నిజం చెప్పాలంటే మనమే నీటిని తరిమివేసాం. చాలా నదులు అంతర్ధానం అయిపోయి, అంతర్వాహినులుగా ఉన్నాయి. వాటిలో మన రాష్ట్రంలోని శ్రీ కాళహస్తిలోని సువర్ణముఖి నది ఒకటి.
                           ఇటువంటి నదులు మనదేశంలో షుమారు 50కి పైగా ఉన్నాయని అంచనా! భూమిలోకి వెళ్ళిపోయిన ఆరావళీ పర్వత ప్రాంతాలలో శుష్కించిపోయిన అయిదు నదులను బతికించిన ‘జలబ్రహ్మ’ జలభాష, ఘోషను అర్ధం చేసుకోగల మహామనీషి, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, తరుణ్ భారత్ సంఘ్ అధినేత అయిన శ్రీ రాజేంద్రసింగ్ ను గురించి మనలో ఎంతమందికి తెలుసు? క్షామపీడిత గ్రామసీమలకు నీటిని రప్పించి సస్యశ్యామలం చేసిన జలదాత ఆ మహానుభావుడు! ఆయన స్ఫూర్తితో తెలుగులో ‘జలగీతం’ అనే 110 పుటల దీర్ఘ కవితను(తెలుగులో వచ్చిన మొదటి దీర్ఘ కవిత ఇదే!) అద్భుతంగా వ్రాసి ఎందరినో ఉత్తేజపరచిన డాక్టర్. యన్. గోపి గారు. మనకు రోజుకి కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కానీ ఇప్పటికీ 88. 4 కోట్ల మంది ( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.

                ఉన్న మంచినీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. అరకిలో కాఫీ తయారవడానికి 11, 000 లీటర్ల నీరు అవసరం. కార్పొరేట్ కంపెనీలు ఆరోగ్యానికి హాని కలిగించే శీతల పానీయాల కోసం వృధా చేస్తున్న మంచి నీటికి ఇక లెక్కే లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ శీతల పానీయాలను నిషేధించాలని కూడా చూస్తున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 16 శాతంగా ఉంది. కానీ ప్రపంచ నీటి వనరుల్లో భారత నీటి వనరులు కేవలం నాలుగు శాతంగానే ఉన్నాయి. ప్రస్తుతమున్న వెయ్యి మిలియన్ల జనాభాకు తలసరి నీటి లభ్యత సంవత్సరానికి ఒక్కో వ్యక్తికి 1. 170 క్యూబిక్ మీటర్లుగా ఉంది. తీవ్రంగా ఉన్న నీటికొరత అవసరాలకు వాడుకునే వారి మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో నీటి యుద్ధాలు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన దేశంలో మాత్రం ఇప్పటికే నదీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. జల వివాదాలకు పెరుగుతున్న నీటి వినియోగమే ప్రధాన కారణం. వర్షాలు తగ్గడం, నదీ ప్రవాహంలో తేడా, అనుమతులు లేకుండా డ్యామ్ల నిర్మాణానికి ప్రయత్నించడం మరి కొన్ని కారణాలు. 2050 నాటికి బ్రహ్మపుత్ర, బారక్, తపతి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ దిశలోకి ప్రవహించే నదుల్లో మాత్రమే తగినంత నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నీటి విలువను తెలిపే పవర్ పాయంట్ ప్రజంటేషన్ ను మరో మహామనీషి, మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాంగారు తయారు చేసి ఎప్పుడో ప్రజెంట్ చేసారు.కానీ మనమే పట్టించుకోలేదు. వాటిని పట్టించుకోలేదు. 

                  భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతటి తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దేశంలో సుమారు 60 కోట్ల మందిని తాగునీటి కొరత తీవ్రంగా పీడిస్తోంది.
ఇది ఇక్కడితో ఆగిపోలేదని, మున్ముందు సమస్య మరింత తీవ్రం కానుందని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని 24 రాష్ట్రాల్లో పరిశీలన జరిపి నీతి ఆయోగ్ ఈ విషయం వెల్లడించింది.
అంతేకాదు.. 21 నగరాలు తాగునీటి విషయంలో పెను ప్రమాదం అంచున ఉన్నాయని హెచ్చరించింది. ఆయా నగరాల్లో తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతుండగా అక్కడి భూగర్భ జలాలు మాత్రం అంతకంటే వేగంగా అడుగంటుతున్నాయని తేల్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ 21 నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని హెచ్చరించింది. నీటి ఎద్దడి ప్రభావం వల్ల ఆహార భద్రతకు ముప్పు కలగొచ్చని నీతి ఆయోగ్ చెప్పింది.
               దేశంలో వినియోగమయ్యే నీటిలో 80 శాతం వ్యవసాయానికే ఉపయోగిస్తుండడంతో నీటి కొరత ప్రభావం ఆహార ఉత్పత్తులపైనా పడనుంది. దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు ఏటా వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటాయి. ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసేలా సువ్యవస్థీకృతమైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఏటా ఈ పరిస్థితి తప్పడం లేదు.వేసవి వచ్చిందంటే పబ్లిక్ కుళాయిలు, వీధుల్లోకి వచ్చే నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెలతో బారులు తీరడం సర్వసాధారణమైపోయింది. ప్రభుత్వం అరకొరగా సరఫరా చేసే నీరు చాలక ప్రయివేటు ట్యాంకర్లనూ ఆశ్రయిస్తుంటారు. ఇక గ్రామాల్లో అయితే స్వచ్ఛమైన తాగునీరు దొరక్క ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని.. దేశవ్యాప్తంగా ఏటా 2 లక్షల మంది అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల రోగాలకు గురై మరణిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. మరోవైపు పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడంతో పట్టణాల్లోని జలవనరులపై మరింత భారం పెరుగుతోంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలో తాగునీటి సరఫరా కంటే అవసరం రెండింతలు ఉంటుందని అంచనా. అంతేకాదు… నీటి కొరత కారణంగా దేశ స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని అంచనా వేసింది. అయితే, జలయాజమాన్యం విషయంలో కొన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.

             నీతి ఆయోగ్ జలయాజమాన్య సూచిలో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అధ్యయనం చేసిన 24 రాష్ట్రాల్లో 15 గత ఏడాది కంటే కొంత ప్రగతి సాధించాయి. మరోవైపు జలయాజమాన్యం విషయంలో అట్టడుగున ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనే దేశ జనాభాలో సుమారు సగం మంది నివసిస్తుండడం ఆందోళనకర అంశం. అంతేకాదు.. వ్యవసాయ ఉత్పాదకతా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఇలాంటి రాష్ట్రాలు జలయాజమాన్యంలో వెనుకబడడంపై నీతి ఆయోగ్ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.జల వినియోగం, యాజమాన్యం విషయంలో కుటుంబాలు, పరిశ్రమలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాలు ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో ఇబ్బంది పడుతున్నాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
               ప్రభుత్వాలు ఇలా ఆలోచించకపోవటం వల్లే సహజ వనరు అయిన నీరు ఇప్పుడు వ్యాపార వస్తువుగా మారింది. డబ్బున్నవాళ్లకు కావాల్సి నంత దొరుకుతోంది. పేదలు కిలో మీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సి న పరిస్థితి తలెత్తింది. నీటిని పొదుపు చేస్తే సమాజానికి మేలు చేసినట్లే. ప్రకృతి ఇచ్చిన సంపద, వరం నీరు. అంత విలువైన నీటిని వృథా చేయటం ఒక విధంగా పాపం. నీరు సమృద్ధిగా ఉంటే సాగు బాగుంటుంది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు , ధాన్యం బాగా పండుతాయి. అందరికీ పని, ఆహారం దొరుకుతాయి. డబ్బు సంపాదిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే నీటి ఉపయోగాలెన్నో. నీటికి సహజ వనరులైన చెరువులను, సరస్సులను, నదులను మనం సంరక్షించుకోవాలి. వ్యర్థాల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న రసాయన ఎరువుల, కల్తీ పురుగు మందుల వాడకంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.
              బీహార్‌‌, పశ్చిమ బెంగాల్‌ లలో భూగర్భ జల మట్టా లు పూర్తిగా తగ్గిపోయాయి. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే వీల్లేక కుటుంబాలతో కలిసి నగరాలకు వలస వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 500కు పైగా మంచినీటి నదులు కలుషితమయ్యాయి. భారీ యుద్ధాల్లో చనిపోయిన సైనికుల కన్నా కలుషిత నీరు తాగి మరణించినవారే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మృత్యువాత పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.

“ జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది! ”

Source : అక్కడక్కడా అంతర్జాలంలో సేకరించినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way