– పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన ప్రజలు
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 151వ రోజున 49వ డివిజన్ గుండాల సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది నెల్లూరు నగరాన్ని వరద ఏ విధంగా ముంచెత్తిందో అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. సాక్షాత్తు సీఎం జగన్ రెడ్డి వచ్చి వరద బాధితులకు ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చినా కూడా నగరంలో ఎక్కడా సాయం చేసిన దాఖలాలే లేవన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్ళు దెబ్బతింటే ప్రభుత్వం ఆదుకోలేదని, ఒక్కో ఇంటికి 15వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బాధితులు మరమ్మతులు చేసుకున్నారని అన్నారు. ఇంటికి 5 వేల రూపాయల సాయం చేయమని నాడు బాధితులు కోరితే 2 వేల రూపాయలు సాయం చేస్తామని వైసీపీ నాయకులు తెలిపారని కానీ ఆ 2వేల రూపాయలు కూడా నేటికీ ఇవ్వలేదని, వైసీపీ ప్రభుత్వ తీరే ఇలా మోసపూరితంగా ఉంటుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా గెలిచేది తామేనని, నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.