ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకొనే పద్ధతి. ప్రజలే సమస్తం, సర్వం అనే విధానం ఆచరణలోకి రావాలంటే ఒక నిర్ణీత ప్రక్రియ అమలు చేయడం ద్వారా అంటే ఎన్నికలను నిర్వహించటం ద్వారా ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయం వెల్లడి చేయటం ద్వారా ప్రజల కోసం, ప్రజల చేత పరిపాలన జరుగుతుంది ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటమే ముఖ్య భూమిక. ఎన్నిక అనేదే కీలకం. ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులందరూ కలిసి చట్టసభలు ఏర్పడటం, చట్ట సభల్లో ప్రజా సంక్షేమం కోసం పాలన సౌలభ్యం కోసం చట్టాలు చేయడం, ఆమోదించబడిన చట్టాల అమలు ద్వారా పరిపాలన సాగడంతోనే ఎన్నికల ప్రక్రియకు సార్ధకత, ప్రజాస్వామ్యానికి ఆనవాలుగా నిలుస్తుంది. అన్నీ క్రమ పద్ధతిలో జరిగితే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, భవిష్యత్ కోసం కృషి పక్షపాతం లేకుండా పరిపాలన జరుగుతుందని విశ్వసించవచ్చు.1950 లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అందరికీ ప్రాథమిక హక్కులు, విధులు నిర్ణయించబడి ఎన్నికలు నిర్వహించటం ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులదే పరిపాలన బాధ్యత అని అర్ధమవుతుంది. ఈ ప్రక్రియ గురించి 320వ అధికరణం లో స్పష్టంగా చెప్పబడింది ఎన్నికల నిర్వహణ కొరకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థను రూపొందించారు. భారత ఎన్నికల కమిషన్ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించుట లో తమ పాత్ర ను పోషించాలి. ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరపాలనేది ఎన్నికల కమిషన్ బాధ్యత, ఎన్నికల కమిషన్ సూచనలు పాటిస్తూ సహకారం అందించటం ప్రభుత్వం యొక్క బాధ్యత. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాజకీయ పార్టీల గురించి కానీ, వాటి పాత్ర గురించి కానీ రాజ్యాంగంలో ఎక్కడా ఏ విధమైన ప్రస్తావనా లేదు. ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నది క్లిష్టమైన ప్రశ్న. ప్రభుత్వాన్ని నడపాలంటే పార్టీలే నడపగలవనే దృష్టితో పార్టీలు ఎన్నికల ద్వారా రంగంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఎన్నికలలో రాజకీయ పార్టీలూ, అభ్యర్థులూ ఓటు అడిగే విధానంలో మార్పు రానంతవరకూ ఎన్నికల ద్వారా మన ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమే. ఎన్నికలు సామరస్యంగా జరిగేలా చర్యలు ఉండాలి, గెలుపు - ఓటములను సమానంగా స్వీకరించగలిగే స్నితప్రజ్ఞత నాయకుల్లో రావాలి, ఎన్నికల తర్వాత గెలిచినా, ఓడినా ఎన్నికల బరిలోనే వాటిని విడిచిపెట్టి, కలసి పని చేయగలిగే మనస్తత్వం ఉంటేనే ప్రజాస్వామ్య సంస్కృతి కి విలువ. అప్పుడే నిజమైన పాలన, సమిష్టి కృషి వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీల తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో చేసే ప్రచారం, దాని పద్ధతి, ప్రచార సాధనాలు, టెలివిజన్ చానళ్ళు, వారు చేసే చర్చలు ఎన్నికలని కలుషితం అవటానికి ముఖ్య కారణంగా మారుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయించిన ఖర్చులు ఎప్పుడో లెక్కలకు అందకుండా పెరిగిపోయాయి. అభ్యర్థుల విషయంలోనే కాక ఎన్నికల్లో ఖర్చు రాను రాను పెరిగిపోయి ఎన్నికలు అంటే సామాన్యులకు అందని ద్రాక్ష లాగా ధనికులకు కల్ప వృక్షం లాగా మారిపోయి ఖర్చు పెరిగిన కొద్ది ఆ డబ్బుకోసం బయటివారిపైన ఆధారపడటం కూడా పెరిగిపోయింది. ఖర్చు పెరిగిపోయి బయటినుంచి వచ్చే డబ్బుపైన ఆధారపడటం పెరుగుతుంది అంటే ప్రజలు గెలిపించినట్లు అవుతుందా? గెలిచాం అని చెప్పుకోవటానికే కానీ ప్రజలకు సేవ చేస్తారా? ప్రజా ప్రతినిధులు ఎలా అవుతారు? ఓటుకి నోటు ఇచ్చి ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఓటు కె0హక్కు కొని ఎన్నికల్లో గెలిచిన వారు వ్యాపారం చేసినట్లే కదా, వ్యాపారి లాభం ,నష్టం చూసుకుంటాడు పెట్టిన ఖర్చుకు రెట్టింపు సంపాదించాలి అనే ధ్యాస తప్ప నోటు తీసుకొని ఓటు వేసిన ప్రజల మీద ఉండదు. నియోజకవర్గంపైన, ప్రజల సంక్షేమంపైన ప్రజాప్రతినిధుల దృష్టి తగ్గింది. దీనివల్ల ఎన్నికల ప్రచార ధోరణే మారిపోయింది. ఒకరినొకరు తిట్టుకుంటూ, శత్రువులలాగా పోరాడుకుంటూ బాధ్యతారహితంగా వ్యవహరించడంతో ఎన్నికలు అనే విధానం పూర్తిగా మారిపోయింది. విలువలు ఆటకెక్కాయి ప్రజాస్వామ్యం కాస్తా ధన స్వామ్యం గా మారిపోయింది. ఓటరూ... నీ గుర్తింపు, నీ ఉనికి, నీ హక్కు, నీ బాధ్యత అయిన ఓటు హక్కును నోటుకు బానిసను చేసావంటే భవిష్యత్తు ఉండదు. ప్రజాస్వామ్యం అనే మాట మర్చిపోవాల్సిందే. మనుగడ ప్రశ్నార్ధకమే.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com