
విజయవాడ, (జనస్వరం) : నగరాలు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిట్టి నగర్ లోని నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమ్యూనిటీ హాల్ లో ఆదివారం జరిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా లింగిపిల్ల. రామకృష్ణ, కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రముఖ న్యాయవాది పిల్ల.రవి వ్యవహరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సామాజిక వర్గంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అందజేస్తున్న ఉపకారవేతనాలు ఎంతగానో దోహదపడుతు ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థులందరూ ఉపకార వేతనాలు వినియోగించుకొని ఉన్నత చదువుకొని సమాజానికి, సామాజిక వర్గానికి ఉపయోగపడాలన్నారు. వృద్ధులకు అందజేస్తున్న పెన్షన్, చీర, దుప్పట్లు వీరందరూ సంక్రాంతి కానుకగా భావించాలని కోరారు. సామాజిక వర్గంలోని అందరూ ఐకమత్యంగా ఉంటే అన్ని సాధించుకోవచ్చని, 4 సంవత్సరాలుగా తనను అందరూ ఆశీర్వదిస్తూ గుండెల్లో పెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి బలంగా ముందుకు నడిపించాలని కోరారు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎంతగానో సామాజికవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఈ ట్రస్టు ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ కోర్సులు చదివే మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే స్థాయికి ఎదగాలని కోరారు. అందుకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేశారు.