నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 67వ రోజున మూలాపేటలోని హిమాలయ స్కూల్ వీధి, బ్రాహ్మణవీధి ప్రాంతాలలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన ఇసుక పాలసీ ప్రజలను దోచుకునే విధంగా ఉందని దుయ్యబట్టారు. ఈ మూడేళ్ళలో తొలి ఏడాది నూతన పాలసీ అంటూ ఒక ప్రణాళిక లేకుండా చేసిన చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉండే లక్షలాది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడడమే కాకుండా ఇసుక ఆధారిత రంగాలన్నీ కుదేలైనాయన్నారు. ఈ వైసీపీ ఇసుక పాలసీ ఆ పార్టీ నాయకులకు కాసుల పంటగా మారిందని, నెల్లూరు పెన్నా తీరంలోని నాణ్యమైన ఇసుక చెన్నై, బెంగళూరుకి అక్రమంగా తరలిపోతోంది అని ఆరోపించారు. ఇసుక పాలసీలోని టోకెన్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వం అధికారికంగా రవాణాతో సహా కలుపుకుని చెప్పే ధరకి బహిరంగ మార్కెట్ లో ధరకి పొంతనే ఉండట్లేదని అన్నారు. గతంలో నెల్లూరు నగరంలో పెన్నా రీచ్ ల నుండి నగరంలో ఏ ప్రాంతానికైనా ఒక ట్రాక్టర్ ఇసుక 1500 నుండి 2000 రూపాయల లోపు లభిస్తే, ఇప్పుడు వైసీపీ పాలనలో 4500 నుండి 6000 రూపాయల వరకు అమ్ముతున్నారని అన్నారు. ఇంతలా ప్రజల్ని దోచుకుని రెవెన్యూ పెంచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బంతా ఏమి చేస్తోందని, ప్రతి మంగళవారం రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెడుతూ ఎందుకు అప్పుకు వెళ్తుందని కేతంరెడ్డి ప్రశ్నించారు. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో పారదర్శకమైన ఇసుక పాలసీకి పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేశారని, ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగానే పేదల ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుకని పంపిణీ చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.