గుంటూరు ( జనస్వరం ) : విద్యార్థులను, యువకులను గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మారుస్తున్న డ్రగ్స్ మాఫియా అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. గురువారం బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ గేట్ వద్ద దొరికిన ప్రమాదకమైన మెదా ఫిటమైన్ డ్రగ్ కేసులో గుంటూరుకు చెందిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు ఉండటంపై ఆయన శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఇప్పటికే గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలై యువకులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని అలాంటిది ఇప్పుడు బ్రౌన్ షుగర్ లాంటి మాదకద్రవ్యాల వ్యాపారాన్ని కూడా వైసీపీ నేతలు ప్రోత్సహిస్తే రాష్ట్రం ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ గుంటూరుకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి నిషేధిత గుట్కా వ్యాపారాన్ని కొనసాగించిన ఆరోపణలు వచ్చాయన్నారు. కొన్ని నెలల క్రితం ఇదే ప్రజాప్రతినిధి కొడుకు , ప్రముఖ హోటల్ యజమాని కొడుకు నైజీరియన్ దేశస్థుడుతో కలిసి మాదకద్రవ్యాలను తయారు చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన కూడా ప్రజలకు తెలిసిందే అన్నారు. దేవాదాయశాఖ భూములు, వక్ఫ్ భూములను సైతం అక్రమించుకునేందుకు ఏమాత్రం వెనుకాడని స్థితిలో ఆ వైసీపీ నేత కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే ప్రజాప్రతినిధి తమ్ముడి కొడుకు మనిషిని క్రూరుడిగా మార్చే బ్రౌన్ షుగర్ వంటి ప్రమాదకర డ్రగ్ ని సప్లై చేయటం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. డ్రగ్స్ సేవించిన యువకులు ఎంతటి దారుణాలకు పాల్పడతారో కొన్ని నెలల క్రితం గుంటూరులో జరిగిన జంట హత్యలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న పలు కాలేజీ విద్యార్థులు ఈ మాదకద్రవ్యాలకు బానిసై బంగారం లాంటి తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. మరలా అధికారం వచ్చే అవకాశం లేదని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే దూరాశతో డబ్బుల కోసం ఉచ్చనీచాలు, పాపపుణ్యాలు మరచి ఎంతటి దుర్మార్గాలకైనా తెగించే స్థితికి వైసీపీ నేతలు చేరారని మండిపడ్డారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజల్ని మత్తుకి బానిసలుగా మార్చమనా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చేస్తున్న దారుణాలు పరాకాష్టకు చేరాయని వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నా అధికార పార్టీ నేతల తీరుతో ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి హానికరంగా, యువకుల, విద్యార్థుల భవిష్యత్ కు ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ వారిలో వైసీపీ నేత బంధువులున్నా, ఎంతటివారినైనా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని పోలీసులను ఆళ్ళ హరి కోరారు.