Search
Close this search box.
Search
Close this search box.

బాలలసేవలో ఆదర్శం డాక్టర్ దాసరి సుబ్రమణ్యం

దాసరి సుబ్రమణ్యం

     అనంతపురం ( జనస్వరం ) :    డాక్టర్ దాసరి సుబ్రమణ్యం చిత్తూరు జిల్లా సోమల మండలం అడుసుపల్లి అనే కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు దాసరి కృష్ణయ్య, శ్రీమతి చెన్నమ్మ అల్లారుముద్దుగా పెంచారు. చిన్నప్పటినుంచే క్రమశిక్షణ, పట్టుదలను అలవరిచారు. ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడుగా ఎన్నో అనుబంధాలతో బాల్యం సాగింది. ఇంటర్మీడియట్ వరకూ సోమల లోనే విద్యాభ్యాసం సాగించారు. తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజి (ఎస్.జి.ఎస్.) లో బి.ఎస్సీ., (బి.జడ్.సి.) పూర్తిచేశారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ హాస్పిటల్ మేనేజిమెంట్ (పిజిడి హెచ్.ఎమ్.) అభ్యసించారు. అందులో భాగంగా శ్రీవెంకటేశ్వర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) లో ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయడంలో తన ప్రతిభను చాటుకున్నారు. ప్రముఖ స్వచ్చంద సంస్థ రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) లో మెడికో సోషల్ వర్క్ విభాగాధిపతిగా అనంతపురం జిల్లాలో 12 సంవత్సరాల పాటు సేవలందించారు. ఆర్డీటీ సహకారం, ప్రోత్సాహంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్ర విభాగంలో పి.జి. చేశారు. వరసగా ఎం.ఎ. (సోషియాలజీ), ఎం.ఫిల్., పిహెచ్.డి., పూర్తిచేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మహిళల్లో గర్భసంచి కేన్సర్ ను తక్షణమే గుర్తించే “ప్యాప్ స్మియర్ పరీక్ష” యొక్క ప్రాధాన్యత గురించి ఎం.ఫిల్. అధ్యయన పత్రంలో వివరించారు. క్యాన్సర్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ఆనాటి రోజుల్లో దాసరి సుబ్రమణ్యం చేసిన అధ్యయనం సామాన్య ప్రజలతో పాటు వైద్యరంగానికి కూడా ఎంతగానో ఉపయోగపడింది. “రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ బాధితులు – సామాజిక, మానసిక సమస్యలు” అనే అంశంపై లోతైన పరిశోధన సాగించి పిహెచ్.డి. పట్టా పొందారు. ఆర్డీటీ ఫౌండర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, సిస్టర్ అన్నే ఫెర్రర్ లకు తన పరిశోధనా గ్రంథాన్ని సుబ్రమణ్యం అంకితమిచ్చారు. అదే సమయంలో బత్తలపల్లి లోని ఆర్డీటి ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ను మొదట ఫెర్రర్ దంపతులు నెలకొల్పారు. తరవాత కొంతకాలానికి 20 పడకల ఆసుపత్రి “క్యాన్సర్ పెయిన్ అండ్ ప్యాలియేటివ్ కేర్” సెంటర్ ను స్థాపించారు. దీంతో దాసరి సుబ్రమణ్యం మరింత విస్తృతంగా తన సేవలందించారు.

             కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డిసిపియూ) లో డా. దాసరి సుబ్రమణ్యం ఉద్యోగం సాధించారు. అనంతపురం జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డిసిపిఓ) గా ఎంపికై, 2013 జూన్ 26 న విధుల్లో చేరారు. పిల్లల రక్షణ, సంరక్షణ కోసం జిల్లాలో దశాబ్దకాలం పాటు విశేష సేవలందించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా డిసిపిఓగా ఆయనను బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశుసంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రెండు దశాబ్దాలకు పైగా “అనంత” అనుభవాలు, అనుభూతులను దాసరి మూటగట్టుకున్నారు. యూనివర్శిటీ విద్యార్థిగా, పరిశోధకుడిగా, సామాజిక కార్యకర్తగా, పిల్లల సేవలో నిబద్ధత గల ప్రభుత్వ అధికారిగా తనను తాను నిరూపించుకున్నారు. సొంత జిల్లాకు బదిలీ రావడం ఆనందమే అయినా మనసునిండా భావోద్వేగంతో కదలి వెళుతున్నారు.

అందమైన పొదరిల్లు :
          వృత్తిలో ఎంత బిజీగా వున్నా చక్కని సంసారం, చల్లని సంతానం అన్నట్లు సాగుతోంది ఆయన వ్యక్తిగత జీవితం. అనుబంధాలతో అల్లుకున్న అందమైన పొదరిల్లులా అన్ని సందర్భాల్లోనూ కుటుంబం అండగా వుంది. దాసరి సుబ్రమణ్యం సతీమణి శ్రీమతి తులసి భర్తకు తగిన భార్య. ఉత్తమ ఇల్లాలు. వారి సంతానం ఆణిముత్యాల్లాంటి ఇద్దరు అమ్మాయిలు. పెద్దకుమార్తె యశస్విణి ఇంటర్ బైపిసి మంచిమార్కులతో పూర్తి చేసింది. నీట్ పరీక్షకు సిద్ధమవుతూ తిరుపతిలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. చిన్న కూతురు చేతన మదనపల్లి నవోదయ కాలేజిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సమాజానికి సుబ్రమణ్యం అందిస్తున్న సేవలు, సాధించిన విజయాల వెనక కుటుంబసభ్యుల సహకారం, వారి ప్రోత్సాహం ఎంతో వుంది. ఇంటాబయటా ఆయన నిరాడంబరుడు, సహనశీలి, నిత్యకృషీవలుడుగా పేరుపొందారు.

జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు హాజరు :
           బాలల హక్కులు, సంరక్షణ చట్టాల గురించి వివరించడంలో సుబ్రమణ్యం నిష్ణాతులుగా కీర్తిగడించారు. దేశం నలుమూలలా జరిగిన శిక్షణా కార్యక్రమాలు, పునశ్చరణ తరగతులు, కార్యశాలలు, అవగాహనా సదస్సులు కలిపి సుమారు 100 దాకా భాగస్వామ్యం వహించారు. ఆర్డీటీ సంస్థలో పనిచేసే కాలంలోనే పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యారు. సంస్థ సహకారంతో ఢిల్లీ, వారణాసి, ముంబై, ధార్వాడ్, చెన్నై వంటి మహానగరాల్లో జరిగిన సెమినార్లలో పాల్గొన్నారు. పోక్సో చట్టం గురించి కేరళలో హైకోర్టు నిర్వహించిన దక్షిణ భారతస్థాయి కార్యశాలలో డిసిపిఓగా హాజరయ్యారు. బెంగుళూరులోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో-ఆపరేషన్ అండ్ ఛైల్డ్ డెవలప్ మెంట్ (ఎన్.ఐ.పి.సి.సి.డి) నిర్వహించిన అనేక కార్యశాలల్లో కీలకపాత్ర పోషించారు. ఎపి పోలీస్ అకాడమీలో పోలీసులకు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులో తనదైన శైలిలో సుబ్రమణ్యం ప్రసంగించారు. పలు అంశాలు, చట్టాలపై పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. బాలల రక్షణ, సంరక్షణ, దత్తత వనరులు, బాల్యవివాహాల నియంత్రణ, మానవ అక్రమరవాణా నివారణ, పోక్సో తదితర చట్టాల గురించి దాసరి సుబ్రమణ్యం రాసిన పరిశోధనా వ్యాసాలు పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.

ప్రముఖ సంస్థల్లో సభ్యత్వం :
     డా. సుబ్రమణ్యం సేవలు, నైపుణ్యం, ప్రతిభను గుర్తించిన పలు ప్రతిష్టాత్మక సంస్థలు సభ్యత్వం ఇచ్చి ఆయనను గౌరవించాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బిఓఎస్) మెంబర్ గా వి.సి. నియమించారు. బత్తలపల్లి ఆర్.డి.టి. ఆసుపత్రిలోని పిజి మెడికల్ సెంటర్ లో ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా డా. దాసరిని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నామినేట్ చేసింది. రాష్ట్ర స్థాయి దత్తత వనరుల గవర్నింగ్ కమిటీ మెంబర్ గా ఎపి ప్రభుత్వం నియమించింది. అలాగే బాలల రక్షణ, సంరక్షణ కోసం పలు కమిటీల్లో కీలక సభ్యునిగా సేవలందిస్తున్నారు.

ప్రతిష్టాత్మక అవార్డుల కైవసం :
        ఏ పనిచేసినా సరే నిబద్ధతగా, సేవాభావంతో అంకితమై పోవడం దాసరి సుబ్రమణ్యం క్రమశిక్షణకు నిదర్శనం. ఇదే అలవాటు ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డులు సైతం ఆయనకు దక్కాయి. అనేక పురస్కారాలు, సత్కారాలు, గౌరవాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రభుత్వం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు సైతం వరించాయి. ఆర్డీటీ సంస్థ సహకారంతో దేశంలోనే ఏకైక ఆదర్శ శిశుగృహ భవనాన్ని నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. సేవాసంస్థకు, ప్రభుత్వానికి వారధిలా వుంటూ, పనుల్లో సమన్వయం చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. అప్పటి కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ, కారా స్టీరింగ్ కమిటీ మెంబర్ రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. కేంద్రం పంపిన అభినందన పత్రాన్ని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా సుబ్రమణ్యం అందుకున్నారు. 2021 మార్చిలో రాష్ట్ర ఉత్తమ డిసిపిఓ అవార్డును మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, సంచాలకుల చేతులమీదుగా అందుకున్నారు. హైదరాబాద్ లో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా 2014లో బాలరక్షక్ అవార్డు దక్కింది. అప్పటి లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి, జాతీయ బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్.సి.పి.సి.ఆర్) అప్పటి ఛైర్ పర్సన్ శాంతాసిన్హా తదితరుల చేతులమీదుగా డా. దాసరి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖ 2015 లో “బాలసేవక్” అవార్డుతో సత్కరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2016 లో ఎపి సిఐడి, “హెల్ప్” స్వచ్ఛందసంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యశాలలో ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాద్ చేతులమీదుగా “ప్రతిభా అవార్డు” నందుకున్నారు. ప్రముఖ సేవాసంస్థ “అవే” హైదరాబాద్ రవీంద్రభారతిలో నిజాయితీ అధికారిగా 2019 ఆగష్టులో సత్కరించింది. ఈ సందర్భంగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ చేతులమీదుగా నిజాయితీ గల ఉత్తమ అధికారి అవార్డును డా.దాసరి అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2015 ఆగష్టు 15 న అప్పటి మంత్రి, జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమసేవా పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2020 జనవరి 26 న మెరిటోరియస్ ప్రతిభా అవార్డు వరించింది. 2019 అక్టోబర్ లో గాంధీ స్ఫూర్తి అవార్డు, నవంబర్ లో బాలమిత్ర పురస్కారం ఇచ్చి నల్లాని రాజేశ్వరి ఫౌండేష( ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్) సంస్థ సత్కరించింది. జిల్లా యంత్రాంగానికి తలలో నాలుకలా వుంటూ, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేయడం డా. దాసరికి వెన్నతో పెట్టిన విద్య. జిల్లాలో “కిశోరి వికాసం” కార్యక్రమం విజయవంతాని కృషి చేసి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా పొందారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్నంగా చేపట్టిన “బాలికే భవిష్యత్తు” కార్యక్రమంలో డిసిపిఓ సుబ్రమణ్యం కీలకపాత్ర పోషించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం గురించి ఆకాశవాణిలో ప్రసారమైన “మన్ కీ బాత్” ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ దాసరి సుబ్రమణ్యం సహనం, నిబద్ధత, సేవాభావంతో “బాలబంధు”గా అందరి మనసుల్లోనూ నిలిచిపోయారు. కార్యదక్షత కలిగిన ప్రతిభాశాలిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అన్ని రంగాల వారికీ ఆదర్శంగా, యువతకు స్ఫూర్తిదాయకంగా, రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way