
– ప్రమాదానికి గురైన ట్రాక్టర్ మరమ్మతులపై విమర్శలు
అన్నవరం, మే 14 (జనస్వరం) : కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం గ్యారేజీ విభాగం పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానం ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన మినీ ట్రాక్టర్ ఇటీవల కొత్తపేట శివారు గౌరీ కళ్యాణమండపం సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రమాదం జరిగిన 24 గంటలు దాటినా ట్రాక్టర్‌ను దేవస్థానం గ్యారేజీకి తరలించి మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బదులుగా సమీపంలోని ఓ ప్రైవేట్ రిపేర్ షెడ్ వద్దకు తరలించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానం గ్యారేజీలో పనిచేసే సిబ్బందికి వాహనాలు మరమ్మతు చేసే సామర్థ్యం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేకపోతే భారీ బిల్లుల కోసం ప్రైవేట్ షెడ్లతో ఏమైనా ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్యారేజీ సిబ్బంది పనితీరుపై అధికారులకే నమ్మకం లేకపోవడంతోనే బయటకు తరలించారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా, ఇదే ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన ఓ అడ్వకేట్ వాహనం దగ్ధమైన ఘటనను కూడా స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో కూడా వాహనాన్ని సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా రోడ్డు పక్కన ఉంచారని, అలాంటి నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారో అధికారులు స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై దేవస్థానం అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాహనాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో పారదర్శకత పాటించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.