గురజాల, జూలై 29, (జనస్వరం): గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో ఆగస్టు 9న జరగనున్న శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవస్థానానికి పేట్ల లక్ష్మి (భర్త: పేట్ల చిన్న యోగయ్య–లేటు), ఆమె మనవరాళ్లు పేట్ల నివ్య యహ్వి, పేట్ల విజ్ఞ ప్రియ పేరిట గ్రానైట్‌ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారి సేవాభావాన్ని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 9న నిర్వహించనున్న తిరునాళ్లలో ప్రత్యేక పూజలు, అమ్మవారి మహా అలంకరణ, అన్నదాన కార్యక్రమాలతో పాటు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ తిరునాళ్ల మహోత్సవానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని ఆలయ కమిటీ వెల్లడించింది. తిరునాళ్లలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.