అనంతపురం, (జనస్వరం) : హంద్రీనీవా ప్రధాన కాలువకు నీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు నిర్వహణ బిల్లులు బకాయిలను విద్యుత్ శాఖకు చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సరఫరా లేక నీటి సరఫరా నిలిపివేశారు. అనంతపురం జిల్లాలోని కసాపురం నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు దాదాపుగా 80 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ ఉంది. ప్రధాన కాలువలతో పాటు ఉపకాలములోని నీటిపై ఆధారపడి వేలాది మంది రైతులు మిరప, వేరుశనగ,మొక్కజొన్న, వరి తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. హంద్రీనీవా పరివాహక ప్రాంతంలో మెట్ట ప్రాంత రైతులందరూ బృందాలుగా ఏర్పడి దాదాపు 4 వేల పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని ప్రధాన ఉప కాలవలలో నీటిని తోడుకొని పంటలకు తడులందిస్తూ పంటలను సంరక్షించుకుంటూ జీవనాధారం పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసి కృష్ణా పరివాహక ప్రాంతమైన శ్రీశైలం డ్యాంలో 200 టీఎంసీల వాటర్ సమృద్ధిగా ఉన్నప్పటికీ, హంద్రీనీవా పరివాహక ప్రాంతంలో 15 రోజులుగా నీరు రావడం నిలిచిపోవడం వలన, అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి. రైతుబంధు, రైతుల్ని ఉద్ధరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న YCP ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తక్షణమే కళ్ళు తెరిచి హంద్రీనీవా కాలువకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావ్ అయ్యా? మీరు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి చిడతల కొట్టడానికి మాత్రమే కనపడుతున్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న సమస్యలు మీ కళ్ళకు కనపడట్లేదా? తక్షణమే హంద్రీనీవా కాల్వకు నీరు అందించకపోతే రైతుల తరఫున అనంతపురం జిల్లా జనసేనపార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు లాయర్ మురళీకృష్ణ, జనసేన నాయకులు మెరుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.