గుంటూరు ( జనస్వరం ) : నగరంలో కలుషిత నీరు తాగి ఇప్పటికి ఐదుగురు మరణించారని, ఎంతమంది చనిపోతే పాలకులు, అధికారులు మొద్దునిద్ర వీడతారని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల, పాలకుల ఉదాసీనతకు ఇంకెంతమంది బలవ్వాలంటూ ఆయన ధ్వజమెత్తారు. సోమవారం వాంతులు, విరేచనాలతో మృతి చెందిన చిన్నారి సరిత కుటుంబాన్ని ఆయన ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయేరియాతో చిన్నారి సరితా చనిపోతే ఆ పేద కుటుంబాన్ని పరామర్శించటానికి కమీషనర్ కు, మేయర్ కు, ఎమ్మెల్యేలకు, మంత్రి రజనీకి కాస్త సమయం కూడా లేదా అంటూ దుయ్యబట్టారు.
నగరంలో డయేరియా విజృంభిస్తోందని ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకుంటున్నా నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం, వైద్య, ఆరోగ్య శాఖలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇవి డయేరియా కేసులు కాదంటూ సమస్యని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారే కానీ సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచనే పాలకులకు లేకపోవడం శోచనీయమన్నారు. ఒకవేళ డయేరియా కాకపోయినా ప్రజలు మృత్యువాత పడుతున్నారు కదా సమస్యేమిటో కనుక్కోని పరిష్కారం చూపాలి కదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ 1400 కోట్లుగా ఉన్నా ప్రజలకు తాగేందుకు గుక్కెడు రక్షిత మంచినీరు ఇవ్వలేని స్థితిలో నగరపాలక సంస్థ కమీషనర్ , మేయర్, పాలకవర్గం ఉంది అంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదని నేరేళ్ళ సురేష్ విమర్శించారు. వైసీపీ నేతలకు ప్రచారయావపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమం పై లేదని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రి రజినీ ఇలాఖాలోనే ప్రజలకు ఆరోగ్య భద్రత లేక ప్రాణాలు పోతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు పెట్టామని గొప్పలు చెప్పుకోవడం కాదని వాటి నిర్వహణను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మురికివాడల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని నగర కమీషనర్ ను ఆయన కోరారు. డయేరియా తో మరణించిన చిన్నారి సరితా కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డయేరియాతో మరో మరణం సంభవించకుండా పాలకులు , అధికారులు క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు తీసుకోవాలని ఆళ్ళ హరి కోరారు. బాధితులను పరామర్శించిన వారిలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, చెన్నం శ్రీకాంత్, పులిగడ్డ గోపి, గడ్డం రోశయ్య, సాయి తదితరులున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com