
నేను కులాలను చూడను, మతాలను చూడను, రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పథకాల్లో ఆయనన్న విశ్వసనీయత కొరవడిందని అలాగే ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు దుయ్యబట్టారు. కలక్టరేట్ ముందు ప్రభుత్వ పధకాలకు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు నిరసనగా కోవిడ్ నిబంధనలతో శాంతి యుతంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణంగా ఒక ఇల్లు నిర్మాణం కోసం ఎన్నో నిబంధనలు పెట్టే మున్సిపల్ కార్పొరేషన్ వారు, పేదలకు ఇచ్చే జగనన్న ఇల్లులు నిర్మిస్తున్నకాలనీల్లో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారని ప్రశ్నించారు. కాలనీ పూర్తిగా నిర్మాణం జరిగితే సుమారు లక్ష మంది జనాభా నివసిస్తారని, వారికి మౌలిక సదుపాయాలతో పాటు ముఖ్యంగా డ్రైనేజీని, రోడ్లును నిర్మాణం ఏ నిబంధనలతో నిర్మిస్తున్నారని అన్నారు. కేవలం 58 గజాల్లో నిర్మిస్తున్న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు?. కేవలం ఇళ్ళు కేటాయించిన వారిలో వైస్సార్సీపీ కార్యకర్తలకే ఎక్కువ మొత్తం ఉన్నారని, మిగతా పార్టీల్లో ఉండే అర్హులైన పేదలకు కూడా ఇల్లులు కేటాయించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైస్సార్సీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇల్లు అలకగానే పండుగ కాదు అని ఎలా అంటారో.. బలవంతపు శంఖుస్థాపనలు చేసినంత మాత్రాన ఇల్లు నిర్మాణం కాదు అని తెలుసుకొని విశ్వసనీయత ను నిరూపించుకోవాలని వైస్సార్సీపీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) జనసేన నాయకులు పిడుగు సతీష్, రావిరాజ్ చౌదరి, బూర్లీ వాసు, చెల్లూరి ముత్యాల నాయుడు, డోల రాజేంద్రప్రసాద్, ఎ.శివ, కె.ప్రసాద్, భాస్కర్, జొయ్ పాల్గొన్నారు.