
విజయనగరం, (జనస్వరం) : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం రోజైన సోమవారం కోవిడ్ ఆంక్షలతో ప్రభుత్వ అధికారులు ఉచిత దర్శనాలు లేవని ప్రచారం ముమ్మరం చేసి, అర్ధాంతరంగా ప్రచారం లేకుండా సోమవారం అమ్మవారి ఉచిత దర్శనానికి అనుమతి ఇచ్చినా భక్తులకు సరియైన సమాచారం లేకపోవడంతో సామాన్య భక్తులు దర్శనానికి దూరమయ్యారని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన విజయనగరం ఇంఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు దుయ్యబట్టారు. సోమవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటు ప్రభుత్వ అధికారులు, అటు వైస్సార్సీపీ నాయకుల హడావుడితో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా జాతర ఏర్పాట్లు ఉన్నాయని, ఆన్లైన్ టిక్కట్లు కొన్నిసార్లు మంచిదైనప్పటికి సామాన్య ప్రజలకు ఎలా తీసుకోవాలో తెలియక దర్శనానికి నోచుకోలేదని వాపోయారు. ప్రజల మనోభావాలు కలిగేలా చేయద్దని, కనీసం మంగళవారం సిరిమనోత్సవాన్నైనా సంప్రదాయబద్దంగా, రాజకీయాలు చేయకుండా నిర్వహించాలని ఆమె కోరారు. అనంతరం పాలవలస యశస్వి గారు ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా విజయనగరం పట్టణంలో జనంకోసం జనసేన అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటిఇంటికి వెళ్లి మౌలిక సదుపాయాల, ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ఈకార్యక్రమంపైన ఆమె కరపత్రాలను విడుదల చేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి, దాసరి యోగేష్, కిలారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.