• దొనకొండ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలి.
• ఈ ప్రత్యేక జిల్లాకు కనిగిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ దర్శి చెంచయ్య గారి పేరు పెట్టాలి.
• వెలిగొండ ప్రాజెక్టు ద్వారా దొనకొండ మరియు కురిచేడు మండలాలకు లబ్ది చేకూర్చాలి.
• వెలిగొండ ప్రాజెక్ట్ కెనాల్ కు గిద్దలూరు నియోజకవర్గం, కంభం ప్రాంతానికి చెందిన స్వర్గీయ కే వీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టాలి
• ప్రస్తుతమున్న మార్కాపురం రెవిన్యూ డివిజన్ తో బాటు, దర్శి రెవిన్యూ డివిజన్ ని ఏర్పాటు చేయాలి.
● ప్రభుత్వానికి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు డిమాండ్.
దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం అనాదిగా నిర్లక్ష్యానికి గురి అవుతూనే ఉందని, ఎంతో చారిత్రక ప్రసిద్ధి వున్న దొనకొండ మండలము అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, కనుక జిల్లాల పునర్వ్యవస్థీకరణలోనైనా ఈప్రాంతానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి, ఈ ప్రాంత ప్రజల మనోభీష్టాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉందని, కనుక దొనకొండను ప్రత్యేక జిల్లా కేంద్రంగా చేసి ఆ జిల్లాకు కనిగిరి ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ దర్శి చెంచయ్య గారి పేరు పెట్టాలి అని జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా దర్శి నియోజకవర్గ పరిస్థితిగాని, ఈ ప్రాంత ప్రజల వలస జీవితముగాని మారలేదని, గత ప్రభుత్వాలు ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని, నాడు ప్రతిపక్షంలో వున్న నేటి అధికార పార్టీ నాయకులు దొనకొండను రాష్ట్ర రాజధానిగా చేస్తే బాగుంటుందని సూచించారని, నేడు వారు అధికారంలో వున్నపుడైనా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆశించారని, గత ఎన్నికలలో ఈ ప్రాంత ప్రజలు నేటి అధికార పార్టీకి బ్రహ్మ రథం పట్టరాని, అధికారంలోకి వస్తే వారు దొనకొండను రాష్ట్ర రాజధానిగా చేస్తారని భావించారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ ప్రస్తావనే రాకపోవడం శోచనీయమని అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం క్రొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్న తరుణంలోనైనా నాడు తమ పార్టీ నాయకులు సూచించిన దొనకొండను కనీసం జిల్లా కేంద్రంగానైనా చేసి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చెయ్యాలని వారు కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వం తాము అధికారంలో వున్నపుడు అమరావతిని రాజధానిగా చేస్తూ, నాడు ప్రతిపక్షం రాష్ట్ర రాజధానిగా సూచించిన దొనకొండను ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధిచేస్తామని వాగ్దానాలు చేశారని, వారి వాగ్దానాలు ప్రగల్బాలుగా మిగిలిపోయాయని, కనీసం నేటి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి, గత తెలుగుదేశం ప్రభుత్వం చేయలేని పనిని తాము నెరవేర్చి, దొనకొండను జిల్లాకేంద్రంగా అభివృద్ధి చేయాలని రమేష్ బాబు కోరారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలలోని అన్ని వెనుకపడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నాడు స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరుతో ప్రకాశంజిల్లానైతే ఏర్పాటు చేశారు కానీ, వాటిని అభివృద్ధి చేయడంలో ఏమాత్రం శ్రద్ద చూపించలేదని, దీనితో ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలు గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని, కనుక వీటి అభివృద్ధి దృష్ట్యా ఒక ప్రత్యేక జిల్లాగా దొనకొండను చేయవలసిన అవసరముందని, దొనకొండలో ప్రభుత్వభూములు ఉన్నాయని, ప్రాచీన కాలంనాటి ఎయిర్పోర్ట్ ఉందని, రైల్వే మార్గం వుందని, ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం చందవరం ఉందని, మిగతా ప్రాంతాలతో పోలిస్తే అన్నివిధాలా జిల్లా కేంద్రంగా అనువుగా ఉంటుందని, పైగా యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి చుట్టుప్రక్కల వున్న నియోజకవర్గాలకు దగ్గరగా ఉంటుందని, కనుక ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, ప్రభుత్వము ఈ విషయాన్నీ గమనించాలని కోరారు. ఈ నియోజకవర్గాలలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజలు ఈ దిశగా ప్రభుత్వాన్ని కోరవలసిన అవసరముందని రమేష్ బాబు అన్నారు. ఈ ప్రత్యేక జిల్లాకి కనిగిరికి చెందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, దక్షిణ భారత దేశంలోనే మొదటి రాజకీయ ఖైదీగా పేరు గాంచినవాడు, గొప్ప సంఘ సంస్కర్త అయిన స్వర్గీయ శ్రీ దర్శి చెంచయ్య గారి పేరు పెట్టవల్సిందిగా రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేసి దీని ద్వారా ఈ ప్రాంతానికి లబ్ది చేకూర్చాలని, ఇందుకోసం ఈ ప్రాజెక్ట్ కొరకు అవిరళ కృషి చేసిన మహానుభావుడు గిద్దలూరు నియోజకవర్గ కంభం గ్రామానికి చెందిన స్వర్గీయ శ్రీ కర్నాటి వెంకట సుబ్బారెడ్డి గారి పేరుతో ఒక కాలువ ఏర్పాటు చేయాలని రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమున్న మార్కాపురం రెవిన్యూ డివిజన్ తో బాటు, తూర్పు ప్రాంత ప్రజలకు సౌకర్యంగా, పరిపాలన సౌలభ్యంగా వుండే విధంగా మరొక రెవిన్యూ డివిజన్ ని దర్శిలో నెలకొల్పాలని రమేష్ బాబు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అనాదిగా అభివృద్ధికి నోచుకోని, దుర్భర వలస జీవితాలతో మ్రగ్గుతున్న ఈప్రాంత ప్రజలకు న్యాయం చెయ్యమని రమేష్ బాబు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ అయిదు నియోజకవర్గాలలోని ప్రజలందరూ ఈ విషయమై పార్టీలకి అతీతంగా ఏకాభిప్రాయంతో ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ రావు ఈ విషయంలో ముందుండి నాయకత్వం వహించి ఈ ప్రతిపాదనను సాఫల్యం చేయవలసిందిగా రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com