అమరావతి, (జనస్వరం) : రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. లోపభూయిష్టంగా ఈ విభజన సాగింది. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం… అదే హేతుబద్ధత అని చెప్పుకొంటున్న ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వారు ఎదుర్కొనే దూరాభారాలు, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదు? అదే విధంగా ఎప్పటి నుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎటపాక, కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కి.మీ. ప్రయాణం చేయాలి. అంటే సామాన్య, పేద గిరిజనుడు జిల్లా కేంద్రంలో అధికారిని కలవాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతుంది. ఈ తరహా విభజన వల్ల ప్రజలకు పాలనను ఏ విధంగా చేరువ చేస్తున్నారో వివరణ ఇవ్వాలి. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ముంపు మండలాల వారికి ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణ తరవాత కూడా ఆ ఇబ్బందులు తప్పడం లేదు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఉండాలనే అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఉండాలనే డిమాండ్లు ఉన్నాయి.
• ఆ బాధ్యత జనసేన తీసుకొంటుంది
జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంలో ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలలో ఏ ఒక్కరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదు. డ్రాఫ్ట్ ఇచ్చే ముందు చర్చలు లేవు. అనంతరం ప్రజలు ఇచ్చిన వినతులను కనీసం పరిగణించలేదు. ఈ అంశంలో ప్రజాభిప్రాయం, వారు చేస్తున్న నిరసనల సమాచారం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో లోపాలు, అసౌకర్యంగా ఉన్న విషయాలపై ప్రజలు చేసే నిరసనలకు జనసేన అండగా ఉంటుంది. తదుపరి వీటిని చక్కదిద్ది.. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకొంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.