*కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులకు ‘టీసీఎస్’ లో ఉద్యోగాలు*
నరసరావుపేట,మే 26( జనస్వరం)
నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్ లోగల బైపాస్ జంక్షన్ వద్ద ప్రముఖ విద్యాసంస్థ "కృష్ణవేణి డిగ్రీ కళాశాల" విద్యార్థులు మల్టీనేషనల్ ఐటీ సంస్థ అయిన 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు నిఖిత రెడ్డి మరియు తిమ్మిశెట్టి హరిణి లు టీసీఎస్ సంస్థ నిర్వహించిన 'TCS B.Sc Ignite & Smart Hiring' నియామక ప్రక్రియలో ప్రతిభ కనబరిచి ఉద్యోగ అవకాశాలకు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ స్థాయి ఉద్యోగాలకు ఎంపిక కావడం కళాశాలకే ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ప్రత్యేక శిక్షణ మరియు సరైన మార్గదర్శకత్వానికి ఈ విజయమే నిదర్శనమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల కృషి, పట్టుదల మరియు అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో వీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. టీసీఎస్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.