బెదిరిస్తే పారిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదు - శ్రీ పవన్ కల్యాణ్ గారు...
భయపెడితే భయపడటానికి... బెదిరిస్తే పారిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదు.. అన్నింటికి సిద్ధపడే తెగించే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నాలాంటి ఆలోచనలు, భావజాలం, ఆశయాలతో జీవించేవాళ్లు ప్రతి గ్రామంలో ఉన్నారు.. అలాంటివారందరిని ఒక్క తాటిపైకి తీసుకురావడానికే జనసేన పార్టీ పెట్టానని అన్నారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా శుక్రవారం నెల్లూరు చేరుకున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై నెల్లూరు జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వస్తే వైసీపీ నాయకులు ఇవి మా ఊళ్లు.. ఇక్కడికి రావొద్దని బెదిరిస్తున్నారు. మీరు బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదు. అలా భయపడే వ్యక్తినే అయితే రాజకీయాల్లోకి వస్తానా? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను కనుకే మెత్తగా మాట్లాడతాను. మెత్తగా మాట్లాడటం బలహీనత కాదు మా బలం.
సాటి మనిషికి అండగా నిలిచేందుకే...
ఈ ప్రాంతంలోనే పెరగడంతో నెల్లూరు జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. సామాజిక సృహ నాలో కలగటానికి, జనసేన పార్టీకి బీజంపడింది ఈ ప్రాంతంలోనే. నెల్లూరులోనే భవానీ బుక్ సెంటర్లో పుస్తకాలు చదువుకొనేవాడిని. యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి పాలించారని నేను రాజకీయాల్లోకి రాలేదు. సాటి మనిషికి అండగా నిలబడటానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఒక గొప్ప నాయకుడి ఆధ్వర్యంలో.. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పని చేశాను. పార్టీ ఐడియాలజీ అయిన అన్ని వర్గాలకు రాజకీయంగా సమాన హక్కులు ఉండాలని అప్పుడు భావించబట్టే ఆ రోజు మొదటి టికెట్ ను యానాదుల కులానికి చెందిన తుపాకుల మునెమ్మ గారికి ఇచ్చాం. పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చేయాలనే గుంపు పక్కనుంటే ఆశయం పక్కదారి పడుతుంది. అలాంటి అనుభవాలను చూసి ఇవాళ జనసేన పార్టీని పెట్టానంటే నా ఆశయం లోతెంతో అర్థం చేసుకోండి. పార్టీ పెట్టింది 2014, 19 సార్వత్రిక ఎన్నికల కోసం కాదు. 25 ఏళ్ల జీవితాన్ని దేశం, రాష్ట్రం కోసం మనదైన వంతు సేవ చేయడానికి. భగవంతుడు నాకు శక్తి, ఆలోచన, పోరాటం చేయగలిగే సత్తా ఇచ్చాడు. చివరి వరకు పోరాటం చేస్తాను. నా పోరాటం మాత్రం ఆగదు.
బలమైన భావజాలం జనసేన సొంతం
మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీకి బలమైన భావజాలం ఉంది. పార్టీకి ఏడు మూల సిద్ధాంతాలు పెట్టడానికి ముఖ్య కారణం సమాజంలో ఉన్న అన్ని సమస్యలు వీటి చుట్టే తిరుగుతాయి కాబట్టి. వైసీపీ నాయకులను మీ పార్టీ భావజాలం ఏంటి అని అడిగితే ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మేలు చేస్తాం అంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అదే ప్రశ్న అడిగితే ఇంకేదో చెబుతారు. అలా ప్రతి పార్టీకి ఒక ఆలోచన విధానం ఉంటుంది. కానీ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికి మేలు జరగాలన్న ఆలోచన, అందరు కలిసుండాలనే భావజాలం మాత్రం జనసేన పార్టీకి మాత్రమే ఉంది. ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన తెచ్చుకున్నాకే మాట్లాడతాను. అవకాశవాద రాజకీయాలు చేయను. అన్యాయం జరిగితే నిర్మొహమాటంగా అన్యాయమనే మాట్లాడతాను. మసీదు, చర్చిలను అపవిత్రం చేస్తే ఏ విధంగా స్పందిస్తానో... దేవాలయాన్ని అపవిత్రం చేస్తే కచ్చితంగా అదే విధంగా మాట్లాడతాను. దేవాలయాలు గురించి మాట్లాడితే మతవాది అనే వాళ్ల మాటలను పట్టించుకోకండి. నా దృష్టిలో అందరు దేవుళ్లు, అన్ని మతాలు సమానమే. కొందరు రాజకీయ నాయకులు లౌకికవాదం అర్థాన్ని మార్చేశారు.
ఆయన్ను సస్పెండ్ చేస్తే జనసైనికుల కష్టాన్ని అవమానించడమే
జనసేన పార్టీ ఓడిపోయిందని అందరూ అంటే నేను మాత్రం గెలిచిందని అంటాను. వందలో 80 శాతం మంది మిగతా పార్టీలకు ఓటు వేస్తే మనకు 8 శాతం మంది ఓటు వేశారు. అంటే మనం 8 శాతం మంది ప్రజల మనసులు గెలిచాం. చాలా నియోజకవర్గాల్లో 20 శాతం, 22 శాతం ఓటింగ్ కూడా జరిగింది. అంత శాతం ఓట్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు. జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ... ఆయన బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డే సీయంగా ఉంటారని అంటున్నారు. ఆయన్ని గెలిపించడానికి జనసైనికులు మెడలో కండువాలు వేసుకొని రోడ్లు మీద తిరిగితే... ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. మేము ఎప్పటికీ అలా చేయం. అలా చేస్తే ఆయన్ను గెలిపించిన జనసైనికులను అవమానపరిచినట్లే.
రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలి. రైతులు ఆనందంగా ఉండాలనే జనసేన పార్టీ జై కిసాన్ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. లాల్ బహుదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితో ఆ పేరు పెట్టాము. రైతు సమస్యలపై రైతు సంఘాలు, శాస్ర్తవేత్తలతో చర్చించి ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా సమస్యలను సమగ్రంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందిస్తాం. పార్టీ తరపున మూడు కీలకమైన ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. అందులో క్రియాశీలక సభ్యత్వం ఒకటి.
రాజకీయ భావజాలాన్ని అలవరుచుకోండి
సోషల్ మీడియాను ఏనాడు కూడా నేను సినిమాల కోసం వాడలేదు. ప్రజా సమస్యల ప్రస్తావనకే వాడుతాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అభినందనలు తెలియజేయడానికి వాడతాను. నా అభిమానులమని చెప్పుకొంటూ నా పార్టీ నాయకులను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జనసేన పార్టీకి నష్టం జరుగుతుందని అనుకోవడం మీ పొరపాటే. దయచేసి అలాంటి పనులు మానుకోండి. ఇలాంటి పోస్టులకు పవన్ కళ్యాణ్ భయపడడు. కిందపడ్డ, మీదపడ్డ నిర్థిష్టమైన లక్ష్యం ఉంది. నా ఆశయాలు నమ్మి నాతో నడిచే వాళ్లు నాతో ముందుకు వస్తే వస్తారు లేకపోతే లేదు. అంతే తప్ప నేను మాత్రం నా ప్రయాణం ఆపేయను. సినిమాలు వేరు... రాజకీయాలు వేరు ఇది అర్థం చేసుకోవాలి. సినిమా పోస్టరుకు పూలదండ వేయడం, పాలాభిషేకం చేయడం వేరు... రాజకీయాల్లో ఒత్తిడి తీసుకోవడం వేరు. దయచేసి సోషల్ మీడియాను జనసేన పార్టీ అభివృద్ధికి వాడండి తప్ప నాయకులను ఇబ్బందిపెట్టడానికి కాదు.
నాయకత్వం అంటే బాధ్యత అని గుర్తించుకోండి. నాయకత్వాన్ని సంపాదించుకోవాలి తప్ప ఇవ్వబడదు. అభిమానులు పొలిటికల్ భావజాలన్ని అలవరుచుకోవాలి. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అన్నట్లు ఎడ్యుకేట్... ఆర్గనైజ్... యాజిటేట్... అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. సమస్యలపై అధ్యయనం చేయాలి... ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్లాలి... సమయ సందర్భాలలో పోరాడాలి. ఏ పార్టీనైనా బయట వ్యక్తులు కాదు లోపలి వ్యక్తులే దెబ్బ కొడతారు. ఏ పార్టీ ప్రోద్బలంతో చేస్తున్నారో కూడా కనిపెట్టగలం. తప్పులు చేసినా చూస్తూ ఊరుకోవడానికి కారణం మారతారనే నమ్మకంతోనే. ఎంతకీ మారడం లేదు అంటే తీసి పక్కన పెడతాం. ఎవరికైనా పార్టీలో ఇబ్బందులు ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. దానికి సమయం, సందర్భం ఉంటుంది. పార్టీ ఎదగాలంటే అందరూ క్రమశిక్షణతో మెలగాల”ని అన్నారు.
రైతుకు అండగా నిలబడాల్సిన సమయం ఇది : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “నివర్ తుపాను కారణంగా ఏడు జిల్లాల్లో భారీ ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. నెల్లూరు జిల్లాలో కూడా పంటలతోపాటు మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. పండిన పంట చేతికందే సమయంలో నష్టం జరిగితే ఆ రైతు బాధ వర్ణనాతీతం. అందుకే నాయకుల నుంచి నష్టం వివరాలు తెలుసుకున్న అయిదు నిమిషాల్లోనే అధ్యక్షులవారు స్వయంగా పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో హైవే, బ్రిడ్జిలు కూడా కొట్టుపోయాయి. నెల్లూరు నగరంలో ప్రవేశించే సమయంలో ఓ రైతు తన ఆవేదన వెళ్లగక్కితే అది అందర్నీ కదిలించింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించడం లేదు. జనసైనికులుగా మీరు వారి తరఫున ప్రశ్నించే బాధ్యత తీసుకోండి. ప్రజాస్వామ్యంలో అది అందరి హక్కు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అధ్యక్షులవారు మీ వెంట ఉంటారు. పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఉంటుంది. అయితే మనం అధికారంలో లేము. యంత్రాంగం మనం చెప్పే మాటలు వినే పరిస్థితి ఉండదు. అయితే ఏ విధంగా చెబితే వారు కదలి వచ్చి సమస్య పరిష్కరిస్తారు అనే అంశంపై జిల్లా స్థాయిలో ఓ ప్రణాళిక తీసుకురావాలి. శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పిన మేరకు రైతాంగాన్ని ఆదుకునేందుకు సిద్దమవ్వండి. గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడిన విధంగా రైతుకు ఒక భరోసా ఇచ్చే విధంగా పార్టీ నుంచి సిద్ధం కావాలి. రైతాంగాన్ని మన భుజాల మీద మోసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. సమాచారం తెప్పించుకుని అధ్యక్షుల వారి పిలుపు మేరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జైకిసాన్ కార్యక్రమాన్ని విజయంవంత చేసేందుకు, కౌలు రైతులకు అండగా నిలబడే విధంగా సిద్ధమవ్వాలని కోరుతున్నాన”ని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి, పి.ఏ.సి. సభ్యులు డా.పి.హరిప్రసాద్, శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు జిల్లా నేతలు శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి, శ్రీ అళహరి సుధాకర్, శ్రీ నలిశెట్టి శ్రీధర్, శ్రీ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com