– విద్యార్థులకు న్యాయం చేయాలనీ అడిగినందుకు మాపై కేసులా?
– ఉపముఖ్యమంత్రిని కలవనున్న జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న
కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటినగరం మండల విద్యాశాఖ అధికారిని జనసేన పార్టీ ఇంచార్జి Dr యుగంధర్ పొన్న కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో చదువును మించిన ధనం మరొకటి లేదు. మనిషిని మహోన్నతుడిగా తీర్చి దిద్దేది విద్య ఒక్కటే అని తెలిపారు. పోతన భాగవతంలో ఇలా ఉంది. చదువుకోనివాడు జ్ఞానం లేని వాడు అవుతాడు. చదువుకున్నట్లయితే ఇది నిజం – అది కల్ల, ఇది స్థిరం – అది అస్థిరం, ఇది శ్రేయస్కరం – అది అరిష్టకరం అని తేల్చుకోగలిగే వివేకం, విచక్షణలు కలిగే శక్తి, చాతుర్యం చదువు వల్ల లభిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ చదువు కోవాలని పోతన భాగవతం చెపుతోందని తెలిపారు.నవిద్యను నేర్పి విజ్ఞానం, వివేకం నింపి మన జీవితానికి అర్ధం తెలిపి, మనకు విలువను పెంచి, మన జీవితంలో వెలుగులు నింపేవారే గురువులని జనసేన భావిస్తోందని తెలియజేసారు. తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందుకు, తరగతి గది ఒక స్మశాన వాటిక అజ్ఞానాన్ని ఖననం చేసందుకు, తరగతి గది ఒక కర్మాగారం జాతి భవితను నిర్మించేందుకు, తరగతి గది ఒక న్యాయస్థానం సరియైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగ పడుతుందని జనసేన భావిస్తోందని తెలియజేసారు. చదువు విజ్ఞానాన్ని అందిస్తుంది. మనిషికి ధైర్యం ఇస్తుంది. జీవించడానికి అవసరమౌతుంది. ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. తన కాళ్లపై తాను నిలబడి బతికేందుకు పనికొస్తుందనేది నా వ్యక్తి గత భావన అని తెలిపారు. గత కొద్ది రోజులుగా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, అన్నంలో పురుగులు ఉన్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు అడిగితే వారిని కొట్టడం, అటెండెన్స్ రిజిస్టర్ లో ఆప్సేంట్ చేస్తున్నారని తెలుపుతూ నా వద్ద బాధపడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించడానికి, విచారించదానికి జనసేనలో పనిచేస్తున్న నాయకులు వెళ్లి పరిశీలించారు. ఉపాధ్యాయులు చక్కగా స్పందించారు. వేరే కార్యక్రమం ఉన్నందువలన నేను వెళ్ళ లేక పోయానని తెలిపారు. 29/7/2022 వ తేది, శుక్రవారం ఉదయం నేనే స్వయంగా మన ఉన్నత పాఠశాల హెడ్ మిస్ట్రెస్ వసుమతిని కలిసానని, తల్లి దండ్రుల ఆవేదనను వసుమతికి తెలుపగా మీ మీద కేసు పెడతానని పరుషంగా మాట్లాడారని తెలియజేసారు. ఈ నియోజకవర్గం లో గతంలో నేను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మ్మెల్యే గా పోటీచేసి, ప్రస్తుతం నియోజకవర్గం ఇంచార్జిగా పని చేస్తున్నానని తెలిపారు. కార్వేటినగరం నా సొంత మండలం, నేను అభ్యసించిన మండలం, నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ మండలం గురించి దుష్ప్రచారం చెయ్యవలసిన అవసరం లేదని, అప్రతిష్టపాలు చేయవలసిన అవసరం లేదని తెలియజేసారు. పరుషంగా మాట్లాడవలసిన అవసరం కూడా లేదని, విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై, శారీరక ఆరోగ్యంపై, ఆధ్యాత్మిక ఆరోగ్యంపై, భావోద్వేగ ఆరోగ్యంపై తినే ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది గనుక స్పందించడం జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్న విషయాన్నీ గ్రహించాలని తెలిపారు. సామాన్య పౌరులు ఎవరు అడిగినా ఒక హెడ్ మిస్ట్రెస్ సమాధానం చెప్పవలసిన స్థానంలో ఉండి కూడా, దురుసుగా మాట్లాడి, నియంతల మాట్లాడి, సరి అయిన సమాధానం చెప్పక, పరుషమైన పదజాలంతో వసుమతి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వెళితేనే ఇంతటి పరుషమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని మాకు బాధ కలుగుతోందని అన్నారు. కొంతమంది విదార్థులు, తల్లి దండ్రులు ప్రత్యక్షంగా చెప్పుకోలేక మాకు తెలియజేసారని, వసుమతి చాలా సంవత్సరాలనుండి నుండి ఇదే పాఠశాలలో కొనసాగుతూ నియంతలా వ్యవహరిస్తున్నారని కొంతమంది తల్లిదండ్రుల ఆవేదనఅని తెలిపారు. వసుమతిని విచారించి, ప్రతి రోజు ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు? ఎంతమందికి వడ్డిస్తున్నరు? చాలామంది మధ్యాహ్నం భోజనం చేయడం లేదు. అయితే మెనూను ఏమి చేస్తున్నారు? వంటి విషయాలపై శోధించి, పరిశీలించి, నియంతలా వ్యవహరిస్తున్న వసుమతి గారిని బదిలీ చేసి, భావి భారత భవిష్యత్ పిల్లలు తయారయ్యే గుడిలో మరొక విద్యావంతులు, సౌమ్యులైన వారిని నియమించవలసినదిగా యంఇఓ కు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఉపముఖ్యమంత్రిని కలుస్తానని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు.