
నష్టపరిహారంగా మనం పన్నులుగా కట్టిన సొమ్ముని ఇవ్వమని నిలదీయండి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…
“ఎన్నికలు వస్తే మన రాజకీయ నాయకులు రూ. 100 కోట్లు – రూ. 150 కోట్లు ఖర్చు చేస్తారు. అలాంటి నాయకులు.. వరదలు, తుపానులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకి తీయరు” అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అన్నారు. ఓటుకి రెండు వేలు ఇచ్చిన నాయకులు… భారీ వర్షాలకు తడిసిపోయిన మగ్గానికి వారి వంతుగా రెండు వేలు ఇవ్వాలి అన్నారు. ఇవ్వకపోతే ఎందుకివ్వరని అడగమని సూచించారు. నివర్ తుపాను మూలంగా కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పర్యటన నాలుగో రోజు నెల్లూరు జిల్లాలో సాగింది. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వెంకటగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “వైసీపీ నాయకుల సొంత డబ్బులు ఇవ్వకపోతే మనం టాక్సులు కట్టిన డబ్బులు ఇవ్వమని నిలదీయండి. వారు వద్దు అనుకున్న మద్యం ఆదాయం మీద వచ్చిన డబ్బులు ఇవ్వమనండి. ఏ ఎమ్మెల్యేకీ భయపడవద్దు. మనం ఆంధ్రులం, సింహపురి బిడ్డలం, మీ వెనుక నేనుంటా. వాళ్ల సొంత డబ్బులు ఏమీ ఇవ్వట్లా. సిమెంటు ఫ్యాక్టరీలు, లిక్కర్ వ్యాపారాల నుంచి వచ్చిన డబ్బులు అడగడం లేదు. మనం అడిగేది మన ఉమ్మడి సొమ్ము. ఇచ్చే వరకు అడగకపోతే వారు ఎప్పటికీ బయటికి రారు. చివరి నేతన్నకు సహాయం అడిగేంత వరకు వైసీపీ నేతల్ని నిలదీసి అడగండి.
తుపాన్ ప్రభావం వల్ల 17 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నివర్ తుపాను పంటలతోపాటు వెంకటగిరిలో ఉన్న వేలాది మగ్గాలను నీట ముంచింది. దారి పొడుగునా చేనేతలు వారి కష్టాలు చెబుతుంటే బాధ కలిగింది. నేను కోట్ల రూపాయలు తీసుకుని బ్రాండ్లకు ప్రమోషన్ చేయను.. కూల్ డ్రింకులు తాగండి.. అవి వాడండి ఇవి వాడండి అని చెప్పను.. నేను ఒకటే చెబుతా- వెంకటగిరి చేనేత వాడుదాం అని చెబుతా. చేనేత మన కళ. అలాంటి చేనేత బతికుండాలని కోరుకునే వాడిని నేను. మన వెంకటగిరి చేనేత వాడుదాం.. మన పొందూరు ఖద్దరు వాడుదాం అని చెబుతా. చేనేత కళాకారులు, కార్మికులు ఏదైనా పేరు పెట్టండి.. వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉండాలనుకుంటానో చేనేత రంగం కూడా అంత లాభసాటిగా ఉండాలని కోరుకునే వాడిని. చేనేత మగ్గాలు నేసే ఆడపడుచులకు ఎలాంటి బాధలు ఉంటాయో తెలుసు. నేను కోరుకునేది చేనేతలు బలపడాలి. వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి. వారి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను.
కొందరికే అండగా ఉంది
చేనేతలకు అండగా ఉంటామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కొంత మందికే అండగా ఉంది. కొంత మందికే డబ్బులిచ్చి చాలా మందిని వదిలేసింది. నేను ఎన్నికల కోసం రాలేదు. సగటు మనిషి బాధలు చూసి వచ్చాను. ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే చేనేత కార్మికుల బాధలు నన్ను కదిలించాయి. మీకు నేను అండగా ఉంటాను. దారి పొడుగునా చేనేత కార్మికుల సమస్యలు తెలియచేశారు. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సదస్సు పెడదాం. సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. వారు మాట వినకపోతే అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా మద్యం మీద వచ్చే ఆదాయం వద్దనుకుని మద్యపాన నిషేధం చేస్తామన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు రైతులు, చేనేత కార్మికులకు పంచండి. ఆకలితో బాధపడుతున్న చేనేత కుటుంబాలకు ఇవ్వండి. ఈ రంగంలో సమస్యలు అందరికీ తెలియజేసేందుకు చేనేత గర్జన, ర్యాలీ నిర్వహిద్దాం. ర్యాలీని నేనే ముందుండి నడిపిస్తాను.
యువత సిఎం..సిఎం అని పిలుస్తుంటే దాన్ని నేను బాధ్యతగా తీసుకుంటా.. గెలిస్తే గెలుస్తాం.. గెలవకపోయినా జనసేన పార్టీగానీ, నేనుగానీ, జనసైనికులుగానీ మీకు అండగా ఉంటాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అద్భుతాలు చేస్తాం అని అడగను. పదవి ఇచ్చినా ఇవ్వకున్నా తుదిశ్వాస వరకు మీకు అండగా నిలబడతాను. నివర్ తపాను వల్ల నష్టపోయిన పంటలకు ఎకరాకి రూ. 35 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాం. ముందస్తుగా రూ. 10 వేలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వం స్పందించని పక్షంలో 7వ తేదీన జిల్లాల్లో నిరసన దీక్షలు చేపడతాం” అన్నారు. అంతకు ముందు వెంకటగిరి బీసీ కాలనీలో తడిసిపోయిన చేనేత మగ్గాలు పరిశీలించారు.