నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 223వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ మసీదు సెంటర్ వీధి ప్రాంతాలలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఇంటికి తిరుగుతున్నా పింఛన్లు తీసేసారని, పథకాలు కోసేసారని చెప్తున్నారని, వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఈ ఏరివేతలు చేస్తున్నట్లుగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం వంటి వాటికి, ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇచ్చేందుకు నిధులు లేకుండా ఖాజానను ఊడ్చేశారని, ఇప్పుడు పథకాలు, పింఛన్ల వంతు వచ్చిందని దుయ్యబట్టారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేకమంది నేడు తమ పింఛన్ ఎత్తేసారని ఆవేదనతో తమ వద్ద వాపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరిగి, ప్రజా సంక్షేమం అర్హులందరికీ చేరాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, ప్రజలందరి ఆశీస్సులతో ఆ రోజు ఎంతో దూరంలో లేదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.