పాల ఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ మరమ్మతులపై నిర్లక్ష్యం తగదు : పోతిన మహేష్
పాల ఫ్యాక్టరీ వద్ద గల చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ ను జిల్లా అధికారులు, విజయవాడ నగర కమీషనర్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లు సందర్శించి, పరీశీలించి ఫోటోలు దిగారు కానీ మరమ్మత్తులు చేయడం మాత్రం మర్చిపోయారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. సోమవారం ఉదయం పోతిన మహేష్ తదితరులు పాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ... ప్రతిరోజూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, లారీలు ఆటోలు, తిరగబడే ప్రమాదం ఉన్నా, ద్విచక్ర వాహనదారులకు నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నా, అధికారులు గాని మంత్రి వెల్లంపల్లి గాని పట్టించుకోవడం లేదని, ఈ ఫ్లై ఓవర్ కు త్వరితగతిన మరమ్మత్తులు చేయించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్లై ఓవరపై పడిన పెద్ద పెద్ద గోతులు, ఐరన్ రోడ్లు బయటకు వచ్చినటువంటి ప్రదేశాల్ని మహేష్ పరిశీలించారు. అదేవిధంగా ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనదారుడు పవన్ కుమార్ కు యాక్సిడెంట్ జరిగి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంశాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకులు మహేష్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అధికారులు, అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి వెంటనే స్పందించి ఫ్లై ఓవర్ కు రాబోయే రెండు రోజుల్లో మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పోరేటర్ అభ్యర్థులు షేక్ అమీర్ భాషా, బొమ్మ రాంబాబు, తాజ్ నోత్, మైనర్ బాబు, పిల్లా వంశీ, బాధర్ల, శివ తదితరులు పాల్గొన్నారు.