
అమరావతి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలతో పాటు, పరిషత్, పంచాయతీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పక్షాన నిలిచి పోరాడిన ప్రతి అభ్యర్థికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికలకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందని, క్షేత్ర స్దాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా ప్రస్తావించి, ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.