గుంటూరు ( జనస్వరం ) : సుమారు నలభై వేలమంది నివాసం ఉండే శ్రీనివాసరావుతోట పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని , ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు నిర్మించిన రాఘవయ్యపార్కును ఎప్పుడు ప్రారంభిస్తారంటూ నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరిని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి కోరారు. తొంభై శాతం పూర్తయిన పార్కును ప్రారంభించకపోవటంతో మంగళవారం శ్రీనివాసరావుతోటలోని రాఘవయ్యపార్కు ఎదుట జనసేన, టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాఘవయ్యపార్కుని వెంటనే ప్రారంభించాలని , కమీషనర్ తక్షణమే స్పందించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ నేతలపై తమకు నమ్మకం లేదని, ప్రజలు సైతం వారిని విశ్వసించడం లేదని అందుకే కమీషనర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు తుప్పుపట్టి ప్రజాధనం వృధా అవుతున్నా అధికారుల్లో కానీ పాలకుల్లో కానీ ఎలాంటి చలనం లేకపోవడం హేయమన్నారు. పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు సైతం వెలగని స్థితిలో పార్కు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చన్నారు. అసలు శ్రీనివాసరావుతోట పరిసర ప్రాంత ప్రజలపై అటు పాలకులకు, ఇటు అధికారులకు ఎందుకు చిన్న చూపో అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగర కమీషనర్ కీర్తి చేకూరి యుద్ధప్రాతిపదికన రాఘవయ్య పార్కుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వీలున్నంత త్వరగా పార్కుని ప్రారంభించాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కార్యదర్శి బండారు రవీంద్ర, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, రెల్లి యువ నేత సోమి ఉదయ్, కోలా అంజి, సుబ్బారావు, శ్రీను, కాసులు, యూసుఫ్, రేవంత్, తిరుపతిరావు, చిరంజీవి, హరి, నాజర్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ నాగూర్, నైజాం బాబు, మస్తాన్ వలి, దారా ప్రసాద్, బియ్యం శ్రీను, సాంబశివరావు, మల్లి, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com