చంద్రబాబు ఏమో 5 ఏళ్ళు గ్రాఫిక్స్ ప్రజలకు చూపించి రాజధానిని తాత్కాలికం చేశాడు. జగన్ ఏమో తమ స్వార్థ ప్రయోజనాల కోసం 3 రాజధానులు అంటూ తప్పుల తడక బిల్లు పెట్టి చేతులెత్తేశాడు. చివరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజధాని అంటూ ఏది లేకుండా చేశారు. అసలు ఈ దుస్థితి గల కారణాలు ఎంటి? దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం...
అమరావతి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దానిని ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత శ్రీ జగన్ రెడ్డి గారు “ అందరికీ అనుకూలంగా ఉంటుంది, రాజధానిగా అమరావతి మాకు సమ్మతమేనని” చంద్రబాబు గారి నిర్ణయాన్ని ఆహ్వానించారు. నిజానికి అమరావతి భూములు చాలా సారవంతమైన భూములు. సంవత్సరంలో మూడు పంటలు పండే బంగారు భూములు. తెలుగుదేశం ప్రభుత్వం భూములను లాక్కుంది. దాదాపు 33000 వేల ఎకరాల భూమిని ప్రజల నుండి లాక్కున్నారు. అమరావతి అద్భుతంగా కడతామని, సింగపూర్ తరహా నగరంగా మారుస్తామని, ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరాలుగా తీర్చిదిద్దుతాం అని కోతలు కోశారు . ఐదేళ్లు కాలయాపన చేశారు. సినిమా వాళ్ళను ఇతర దేశాల్లో ఇంజనీర్లను పిలిచి ఆకృతులు తయారు చెయ్యమని కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ చేసింది శూన్యం. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అట్టహాసంగా పునాది కార్యక్రమం చేసి, ప్రధానిని పిలిపించారు. ప్రజల దగ్గర ఇటుకల కోసం డబ్బును సేకరించారు. ఇతర విరాళాలు సేకరించి పెట్టుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయి అనగా పనులు ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజలకు డబ్బు పంచడానికి పసుపు కుంకుమ పేరిట డబ్బును ఇవ్వడానికి అమరావతి బాండ్లు అమ్మి, తాకటు పెట్టీ డబ్బు పంచారు. ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుకుందాం. వైసీపీ ప్రభుత్వం అమరావతిని ఎలా చంపేస్తోందో చూద్దాం.
1. వైసీపీ ద్వంద వైఖరి: వైసీపీ 151 సీట్లతో గెలిచింది.
గెలిచిన తర్వాత రాష్ట్ర రాజధాని మారుస్తామని, దొనకొండ లో ఏర్పాటు చేస్తామని తరచూ విలేఖరుల సమావేశాలు పెట్టింది. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రాజధానిగా ఉండదని స్పష్టం చేస్తూ వచ్చారు. నిలకడలేని జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాల వలన రాజధానికి ఆర్థిక సహకారం నుండి ప్రపంచ బ్యాంక్, ఆసియన్ బ్యాంక్ లు ఉపసంహరించుకున్నాయి. మొన్నటికి మొన్న సింగపూర్ ప్రభుత్వం కూడా వెళ్లిపోయింది. జగన్ రెడ్డి విధానాల వలన రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతింది. ఆర్థికంగా రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ఆరోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు తమకు సమ్మతం అని చెప్పిన జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే రాజధానిని మారుస్తాం అనడం ద్వంద వైఖరి కనపడుతోంది.
2.సౌత్ ఆఫ్రికా స్ఫూర్తి :
సౌత్ ఆఫ్రికాలో మొదట ఇలాంటి మూడు నగరాలు, మూడు రాజధానులుగా చేసి అభివృద్ధి చెయ్యాలి, జరుగుతుంది అని భావించారు. కానీ, అలా అభివృద్ధి జరగలేదని స్వయంగా ఆదేశపు ప్రధాన మంత్రి గారే చెప్పారు. అలా ఒక విఫల ప్రయోగాన్ని స్ఫూర్తి తీసుకోడం వెనుక ఉన్న ఆలోచనలు ఎంటి?
3. మూడు రాజధానులు ప్రయోగం వలన కలిగే నష్టాలు, కష్టాలు:
రాజధానిని మూడుగా విభజిస్తూ అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో పాలన రాజధాని, కర్నూల్ లో హై కోర్టు గా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు.
పాలన పరమైన సమస్యలు : అసెంబ్లీ ఒకచోట, మిగతా అధికారులు అంత విశాఖలో ఉంటే పాలన పరమైన సమస్యలు ఎన్నో వస్తాయి. అన్ని ఒకే చోట ఉంటేనే పనులు అవ్వడంలో ఎంతో జాప్యం జరుగుతోంది. మరి అసెంబ్లీ ఒకచోట, మిగతా అధికారులు ఇంకొక చోట ఉంటే పరిస్థితి ఎంటి? ప్రతి మంత్రి కింద ఒక విభాగం ఉంటుంది. మంత్రి అమరావతిలో ఉండి, ఆ విభాగంలోని మిగతా అధికారులు విశాఖలో ఉంటే పాలన ఎలా కుదురుతుంది? ఇది అసలు సాధ్యమేనా? కుటుంబంలో తండ్రి ఒకచోట ఉంటూ, తల్లి ఇంకొక చోట, పిల్లలు తలోక చోట ఉంటే అది ఎలా ఉంటుందో ఇదికూడా అలానే ఉంది.
ఆర్థిక పరమైన సమస్యలు : ప్రస్తుత జగన్ రెడ్డి గారు వారానికి ఒక్కసారి నాంపల్లి కోర్టుకు వెళ్లి రావాలంటే 60 లక్షల ప్రజాధనం ఖర్చు అవుతుంది. మరి అమరావతికి, విశాఖకు తిరగాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? మళ్లీ అదనంగా వ్యక్తిగత కేసులు మళ్లీ, ఇలా తిరుక్కుంటూ ఉంటే పరిపాలన ఏమాత్రం చేస్తారు? అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతికి, విశాఖకు తిరగాలి అంటే ప్రభుత్వానికి ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చుతో పాటు సమయం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు తిరగడానికి సరిపోతే పనులు ఎప్పుడు చేస్తారు?
భూ సేకరణ : విశాఖలో, కర్నూల్ లో మిగతారెండు రాజధానులు కట్టాలి అంటే భూమి అవసరం. భూసేకరణ చెయ్యాలి. ప్రభుత్వానికి మళ్లీ భారం. ఇప్పటికే భూసేకరణ చేసిన భూములలో రాజధానికి కట్టడానికి నిధులు లేవని స్వయంగా ఆర్థిక మంత్రి గారే పాత్రికేయ ముఖంగా చెప్పారు. మరి ఇప్పుడు అక్కడ భూసేకరణ చెయ్యాలి అంటే నిధులు ఎక్కడ నుండి తెస్తారు? ప్రస్తుతం అప్పుల్లో ఉన్న రాష్ట్రం మళ్లీ అంతటి భారాన్ని మోయగలదా? జీతాలు ఇవ్వలేక, గడవక విశాఖలో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేయాల్సిన దుస్థితిలో ఉన్న ప్రభుత్వం కొత్తగా రాజధాని కట్టడానికి నిధులు ఎక్కడ నుండి తెస్తారు? భూసేకరణ నిధుల పరిస్థితి ఎంటి? ఇప్పటికే ఈ ఆరు నెలల్లోనే 32 వేల కోట్ల అప్పులు చేశారు. అప్పుల పరిధి కూడా అయిపోయింది. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం ఎంత వరకు సమంజసం? సౌత్ ఆఫ్రికా అనేది ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఈ రెంటికీ చాలా తేడా ఉంది. ఈ తేడా తెలియకుండా ఏమి పరిపాలిస్తారు? ఇదంతా ఒకఎత్తయితే అక్కడ ఉన్న పంట పొలాలను ఇవ్వాలి. పంటలు బాగా పండే భూములు ఇస్తే అన్నదాతల పరిస్థితి ఎంటి? ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఎంటి? ఇవేమీ ఆలోచించకుండా ఉన్నపళంగా రాజధాని మారుస్తాం. మూడు ముక్కలు చేస్తాం అనడం వైసీపీ ప్రభుత్వం యొక్క అవగాహన, అనుభవ రాహిత్యం తెలుపుతోంది.
న్యాయ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ, అసెంబ్లీ ఇవన్నీ కలిపితే నే ఒక పూర్తి ప్రభుత్వం. ఇలా ఒక్కొక్కటి విభజించి ఒక్కో చోట పెడితే ప్రభుత్వం సక్రమంగా ఎలా నడుస్తుంది? విధానాలు చేసేటప్పుడు చాలా వ్యవహారాలు ఆలోచించి చెయ్యాలి. కానీ నేడు 52 మంది ఖరీదైన ప్రభుత్వ సలహాదారులను నియమించుకుని జగన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలు వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయి.
అమరావతి సంగతి ఏంటి? ఇప్పటికే 33000 వేల పంట భూములను లాక్కున్నారు. మరి వాటిని ఏమి చేస్తారు? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏమి సమాధానాలు చెప్పగలరు? అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, అవినీతి తారాస్థాయిలో ఉంది అని పుస్తకాలు రాశారు మరి ఎందుకు విచారించి తప్పు చేసిన వారిని అరెస్ట్ చెయ్యడం లేదు? టీడీపీ వాళ్లు అమరావతిలో దోచుకున్నారు. మేము విశాఖలో, కర్నూల్ లో దోచుకుంటాము అనే ఆలోచనలు ఉన్నారా? నిన్నా మొన్నటి వరకు కూడా అవినీతి జరిగింది అనే అంటున్నారుగాని దాన్ని ఎందుకు నిరూపించే ప్రయత్నాలు చెయ్యడం లేదు? లోలోపల ఇద్దరు ఒకటే, ఒక నిష్పత్తిలో పంచుకున్నారు అనేనా?
ఆర్థిక భారం : ఉన్న రాజధానినే కట్టలేని వాళ్ళు, కొత్త రాజధానులు ఎలా కడతారు? మనల్ని చూసి ఏ బ్యాంకు అప్పులు, లోన్లు ఇవ్వదు మరి ఎలా కడతారు? అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచినట్లూ పంచుతున్నారు తప్ప ఆర్థికాభవృద్ధికి యే మాత్రం కృషి చేస్తున్నారు? ఆర్థికాభివృద్ధి లేని చోట ఆర్థిక వ్యవస్థ స్థితి బాగుండదు. అలాంటి వాళ్లకు యే బ్యాంకు లోనూ ఇవ్వదు. కాబట్టే వచ్చిన రెండు ప్రపంచ స్థాయి బ్యాంకులు వెళ్లిపోయాయి. సింగపూర్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నిలకడ లేని ప్రభుత్వ విధానాల వలన పెట్టుబడులు కూడా రావు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పడి 6 నెలలు అవుతోంది కానీ ఒక పెట్టుబడి కూడా రాలేదు. ఇటు వంటి పరిస్థితుల్లో రాజధానిని ముక్కలు చేస్తాను అనడం హాస్యాస్పదం.
అధికార వికేంద్రకరణ, అభివృద్ధి వికేంద్రకరణ రెండు ఒకటీ కాదు : అధికార వికేంద్రీకరణ లో అధికారం స్థాయిని బట్టి వికేంద్రీకరిస్తారు. రాజ్యాంగం దీని గురించి ఎప్పుడో చెప్పింది. కొత్తగా మళ్లీ వికేంద్రీకరణ చేస్తాను అని అవగాహన రాహిత్యంగా మాట్లాడ్డం చాలా పెద్ద తప్పు. అధికార వికేంద్రీకరణ ప్రస్తుతానికి మనకు అవసరం లేని విషయం. దాని వలన ప్రాంతాలు అభివృద్ధి చెందలేవు. నిజానికి దాని వలన పరిపాలన కుంటుపడుతుంది. మనకు తక్షణం అవసరమైనది అభివృద్ధి వికేంద్రీకరణ. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యకుండా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడం చాలా అవసరం. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాంతీయ భేదాలను తొలగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి దాకా ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పరిపాలించింది రాయలసీమకు చెందిన నాయకులే కానీ ఇప్పటి రాయలసీమలో వలసనూ ఆపలేకున్నారు. అసలు ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. అధికారం రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళకే ఉండి ఎందుకు అభివృద్ధి చెందలేదు? దాని అర్థం అధికార వికేద్రీకరణ వలన అభివృద్ధి జరగలేదని కదా? కాబట్టి ఎవరికైనా అభివృద్ధి వికేంద్రీకరనే ముఖ్యం. రాష్ట్రానికి హైదరాబాదు లాంటి నగరం అవసరం. అది ఒక్కరోజులో జరిగేది కాదు. ప్రాంతాన్ని బట్టి పరిశ్రమలు నిర్మించాలి, ఉద్యోగాలు కల్పించాలి అంతేగానీ అధికారం ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఇచ్చినంతన ప్రజలకు చేకూరేది ఏమి లేదు.
అమెరికాలో ప్రెసిడెంట్ భవనం, పార్లమెంట్, సుప్రీం కోర్టు అన్ని ఒకే చోట ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో మూడు వేరే వేరే చోట్ల ఉన్నాయి. అమెరికా అభివృద్ధి చెందినంత సౌత్ ఆఫ్రికా ఎందుకు అభివృద్ధి చెందలేదు? పైగా అవి దేశాలు కానీ మనది ఒక రాష్ట్రం. విశాఖ, తిరుపతి లాంటి నగరాలు 100 స్మార్ట్ సిటీస్ జాబితాలో ఉన్నాయి. వాటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ మిగతా నగరాల పరిస్థితి ఎంటి? ఈశాన్య రాష్ట్రాల్లో 450 కోట్లకు అత్యాధునిక అసెంబ్లీ భవనాలు నిర్మించారు. అలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుంటే మంచిది.
ఈవిధంగా అవగాహన లేని విధానాలు చేస్తూ, అధికార వికంద్రీకరణ వలన ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలను రెచ్చగొట్టి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచూకోవాలని ప్రయత్నించడం చాలా పెద్ద తప్పు. ప్రజలు అమాయకులు 70 శాతం కూడా అక్షరాస్యత లేని ప్రజలకు ఇవన్నీ ఏమి తెలియవు. రాజకీయం కోసం వార్త పత్రికలతో ఛానెళ్లతో ప్రజలను రెచ్చగొట్టడం, భావోద్వేగాలతో ఆడుకోవడం చాలా ప్రమాదకరం. టీడీపీ ప్రభుత్వ౦ చేసిన అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేసి జైల్లో వెయ్యలే గాని అవినీతి జరిగిందని రాజధానిని మారుస్తాం, విభజిస్తాం అనడం ప్రమాదకరం. ఆలోచిస్తే వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వంలాగా రాజధాని విషయంలో లబ్ది పొందాలని భావించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనుకోవచ్చేమో. చూస్తుంటే అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ కు తక్షణం కావల్సినది ఆర్థికాభివృద్ధి. దానికి సంబంధించిన విధానాలు చేస్తే బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. పళ్ళెం లేకుంటే, ఆకులో అయిన తినొచ్చు అసలు అన్నమే లేదంటే ఏమి తింటాం. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి జబ్బు పట్టిస్తే, దానికి కొనసాగింపుగా వైసీపీ ప్రభుత్వం ఏకంగా చంపేసే ప్రయత్నం చేస్తోంది. అప్పులు చేసి పప్పు బెళ్లాలు పంచినట్లు పంచుతున్నారు. ఆ అప్పులకు వడ్డీలు ఎవరూ కడతారు? ఇవేమీ ఆలోచించకుండా, యువతను, ప్రజలను రెచ్చగొట్టడం తప్పు. వైసీపీ విధానాలు టీడీపీ 2.0 లాగా ఉన్నాయే తప్ప ప్రజల కోసం అన్నట్లు లేవు. విశాఖ పట్టణం ఇప్పటికే కొంత అభివృద్ధి చెంది ఉంది కొత్తగా కార్యనిర్వహక వ్యవస్థ రాజధానిగా పెట్టడం వలన ఒరిగేది ఏమి ఉండదు. ఇలాంటి నిలకడలేని ప్రభుత్వాలను నమ్మి యే కంపెనీ ముందుకు వస్తుంది. కాబట్టే ఇంతవరకు ఒక కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టలేదు. స్వప్రయోజనాల రాష్ట్రాన్ని టీడీపీ తాకట్టు పెడితే, వైసీపీ ప్రభుత్వం ఏకంగా అమ్మేయాలని ప్రయత్నిస్తోంది.
నేటి పరిస్థితులను విశ్లేషణ ఓ సారి విశ్లేషణ చేసుకుందాం...
ప్రజలు చేత ప్రజలకు కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వానికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం విశ్వసనీయత. ఆ విశ్వసనీయత మీద ఆధారపడే చాలా కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఆ నమ్మకాన్ని ఇవ్వని రోజున ఎవ్వరూ ముందుకు రారు. ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ విశ్వసనీయత లేదు. అసలు ఆ పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా లేదు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్తూ విశ్వసనీయత అంటే ఏంటో చూపిస్తాను. ముఖ్యమంత్రి పదవికే వన్నె తెస్తాను అని చెప్పారు. కానీ ఈరోజు అన్ని విషయాల్లోనూ మాట తప్పుతున్నాడు, మడమ తిప్పేస్తున్నాడు. ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టడం తనకు ఇష్టం లేదని, రాజధాని ఎక్కడున్నా ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు. అమరావతి మూడు ప్రాంతాలకు అందుబాటులో ఉంది కాబట్టి అమరావతి రాజధాని గా ఎంపిక చేయడాన్ని నాకు, మా పార్టీ వాళ్లకు సమ్మతమే అని సాక్షాత్తు గుడి లాంటి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అన్నారు. గెలవగానే మూడు రాజధానులు అని మాట మార్చేశారు. ఇదేనా ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి గారి విశ్వసనీయత?
జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తాడని పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్ రెడ్డి అమరావతిలోనే ఉంటాడని, గెలిస్తే రాజధాని మార్చడని, అందుకోసమే ఇల్లు అక్కడే కట్టుకున్నాడు అని స్వయంగా వైసీపీ నాయకులైన ఆర్కే రోజా రెడ్డి గారు పత్రికా సమక్షంలో అన్నారు. మరి గెలవగానే మూడు రాజధానులు అని మాట మార్చేశారు. అలా మార్చడం వలన 33 వేల ఎకరాలు పొలం ఇచ్చిన రైతులకు ఏమని సమాధానం చెప్తారు? ఏమని నమ్మకాన్ని, విశ్వసనీయతను ఇస్తారు? ఇలాంటి పనులతో పెట్టుబడులు ఎలా ఆకర్షిస్తారు? ఎవరు మాత్రం ఎందుకు పెడతారు? మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి రైతులు ధర్నా చేస్తున్నారు. హైకోర్టులో వందలాది కేసులు, వ్యాజ్యలు వేశారు. మొన్న హై కోర్టు చీవాట్లు పెట్టేసరికి ఉన్నపళంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దాంట్లోని సాంకేతిక పొరపాటులను సవరించి తిరిగి మళ్లీ ప్రవేశ పెడతామని అన్నారు. ప్రభుత్వం తరపున ఈ కేసుని వాదించిన లాయర్ కు 5 కోట్లు ఫీజు కింద చెల్లించారు. నిన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. మరి ఆ ప్రజా ధనాన్ని వ్యర్థం చేశారు. దానికి సమదానం ఏమని చెప్తారు?
ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అమరావతి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. కేంద్రం కూడా అమరావతిలో రాజధాని కోసం 1500 కోట్లకు పైగా నిధులను ఇచ్చింది. కాస్తో కూస్తో భవనాలు నిర్మాణం అయ్యాయి. నిన్న వైసీపీ జగన్ రెడ్డి గారు CRDA చట్టాన్ని రద్దు చేశారు, రాజధాని బిల్లు వెనక్కు తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు వలన విశ్వసనీయత ఎలా ఉంటుంది? మూడు రాజధానుల అని ప్రకటించిన జగన్ రెడ్డి గారు మరి రాజదాని అమరావతి టాక్స్ పేరు మీద పెట్రోల్, డీజిల్ మీద ఎందుకు వసూలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎగువ సభ అనగా మండలి వలన ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతోందని, మండలిని రద్దు చేయాలని చెప్పిన వ్యక్తి, గెలిచిన తర్వాత మండలి రద్దు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ ప్రతిపాదన ను వెనక్కు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వెనక్కు తీసుకున్నారు? ఇదేనా మాట మీద నిలబడడం? ఇదేనా విశ్వసనీయత? ఇలా మాటలు మారుస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా నిర్ణయాలు తీసుకునే వాళ్లకు విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది? దీని వలన నష్టపోయేది వాళ్ళు కాదు, జనం మరియు రాష్ట్ర అభివృద్ధి. అవసరానికో మాట, పూటకో రంగు మార్చే ప్రభుత్వం పైన ఎవరికి మాత్రం ఎందుకు నమ్మకం ఉంటుంది? పెట్టుబడుల ఎలా వస్తాయి? రావు. కాబట్టే రాష్ట్రం అతః పాతాళంలోకి వెళ్ళిపోయింది. పరిపాలించే వాళ్ళు మారినా పరిపాలన నిర్ణయాలు మారకూడదు. అప్పుడే ఒక నిర్దిష్టమైన, అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉంటుంది. అవి రెండూ నేడు లేవు. ఈ ప్రభుత్వం నేడు అధికారంలో ఉండొచ్చు, రేపు రావచ్చు, రాకపోవచ్చు కానీ నష్టపోయేది నాయకులు కాదు... ప్రజలు.
#Written By
@BhagathChegu ( ట్విట్టర్ )
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com