Logo
Date of Publish : 07 March 2026, 10:45 pm
Editor : Sake Naresh

ప్రపంచీకరణ స్ఫూర్తితో మహిళల సమగ్రాభివృద్ధికి సమిష్టికృషి

- అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ నల్లాని రాజేశ్వరి పిలుపు :

- సభాధ్యక్షులు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విసి ప్రొ. మునిరత్నం నాయుడు :

అనంతపురము, మార్చి 07, జనస్వరం : మహిళల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం, పౌరసమాజం సమిష్టికృషి సాగించాలని ప్రముఖ సామాజికవేత్త, రచయిత్రి, కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్" అవార్డు గ్రహీత డాక్టర్ నల్లాని రాజేశ్వరి పిలుపునిచ్చారు. బాలికావిద్య, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత కోసం నిరంతర సేవలందిస్తున్నానన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో మహిళలకు అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని రాజేశ్వరి వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (రాజమహేంద్రవరం) ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేకంగా వెబినార్ నిర్వహించారు. ఉపకులపతి ప్రొఫెసర్ డి. మునిరత్నం నాయుడు ఈ అంతర్జాల సదస్సుకు అధ్యక్షత వహించారు. సమన్వయకర్తలుగా లేళ్లపల్లి శ్రీదేవి, సత్తిరాజు పద్మ, మెహెర్ గాయత్రి వ్యవహరించారు. 'ఆకాశవాణి' ఉన్నతశ్రేణి గాయని గరిమెళ్ల కళ్యాణి (ఢిల్లీ) పాడిన "జయ జయ గీర్వాణి" స్వాగతగీతం ఎంతగానో అలరించింది. "ప్రపంచీకరణ - సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర" అనే అంశంపై ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రముఖ మహిళలు అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ, గ్లోబలైజేషన్ అనే ఇంగ్లీషుమాటకు తెలుగులో ప్రపంచీకరణ అని చెప్పుకుంటున్నామన్నారు. సోవియట్ రష్యాలోని వామపక్ష ప్రభుత్వం పతనం కావడంతో 1991లో అమెరికా అగ్రరాజ్యంగా నిలబడిందన్నారు. ప్రపంచదేశాలు గాట్ ఒప్పందం మీద సంతకాలు చేసిన ఫలితంగా ఎల్.పి.జి వ్యవస్థ (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) అమలులోకి వచ్చిందన్నారు. ఈ మార్పు సమాజంలో అనూహ్యమైన పరిణామాలను తీసుకొచ్చిందన్నారు. సమాజంలో ఏ మార్పు వచ్చినా, దానికి చీకటి, వెలుగు కోణాలు రెండూ ఉంటాయని, ప్రపంచీకరణ పరిణామాలు కూడా అంతేనన్నారు. మహిళల దృష్టికోణం నుండి ప్రపంచీకరణను అర్దం చేసుకోవాలన్నారు. సమాజంలో మహిళల పాత్రను ప్రపంచీకరణ గణనీయంగా మార్చివేసిందన్నారు. మహిళలకు విద్యా, ఉపాధి అవకాశాలను పెంచి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించిందన్నారు. మెట్రోపాలిటన్ నగరాలకు వలసలు పెరగడం, కార్పొరేట్ రంగంలో భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం ఉపాధి పొందడం మహిళల సాధికారతకు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. "ప్రపంచీకరణ - సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర" అనే అంశం మీద లోతుగా చర్చించడం ప్రస్తుతం చాలా అవసరమన్నారు. ఐటి, సర్వీస్, ఉత్పాదక రంగాలలో అవకాశాలు పెరగడంతో మహిళలు ఆర్థిక సాధించినకారత దిశగా సాగుతున్నారని చెప్పారు. మెరుగైన ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మహిళల వలసలు పెరిగాయన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి పరంగా చూస్తే, ప్రపంచీకరణ వల్ల విద్య, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశాలు మహిళలకు విస్తృతమయ్యాయన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో సామాజిక మార్పు కూడా వచ్చిందన్నారు. సాంప్రదాయక పాత్రల నుండి బయటపడి, మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. ఇంకా అనేక సవాళ్లు మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, పని ప్రదేశాలలో వివక్ష, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యత వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయన్నారు. మొత్తంగా, ప్రపంచీకరణ మహిళలకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టడంతో పాటు, సామాజిక నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేసిందని డాక్టర్ నల్లాని రాజేశ్వరి వివరించారు.
"తెలుగుభారతి" సంపాదకురాలు కొమరవోలు సరోజ (టొరాంటో, కెనడా) మాట్లాడుతూ, కెనడాలో మహిళలకు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వని పరిస్థితి వుండేదన్నారు. శ్రీలంక నుంచి వలస వచ్చే బాధితులకు కెనడాలో ఆసరా కల్పిస్తున్నారన్నారు. కుటుంబం నుంచే సమానత్వం, సాధికారత మొదలు కావాలన్నారు. డాక్టర్ పద్మ మల్లెల (న్యూజిలాండ్) మాట్లాడుతూ, న్యూజిల్యాండ్ లో మాతృస్వామ్య వ్యవస్థ నడుస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేయడంలో మహిళదే ప్రధాన బాధ్యతన్నారు. ప్రముఖ కవయిత్రి పాతూరి అన్నపూర్ణ (నెల్లూరు) మాట్లాడుతూ, ప్రపంచీకరణ వల్ల మహిళా సాధికారతకు అవకాశం పెరిగిందన్నారు. "విజయపతాక" శీర్షికతో స్వీయకవితను వినిపించారు. ప్రముఖ సామాజికవేత్త, రచయిత్రి డాక్టర్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు అనేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. మహిళలకు కుటుంబ ప్రోత్సాహం లభిస్తే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమన్నారు. మహిళల పట్ల హింస, వివక్ష లేకుండా సమానత్వం సాధించడానికి సమిష్టికృషి సాగించాలన్నారు. గోవిందరాజు సుభద్రాదేవి మాట్లాడుతూ, మహిళలకు విద్య రక్షణ కవచం లాంటిదన్నారు. అరుణాశర్మ (ఆస్ట్రేలియా) మాట్లాడుతూ, వివేకవంతురాలైన స్త్రీ వల్లే కుటుంబం, సమాజం అభివృద్ధి దిశగా సాగుతాయన్నారు. న్యాయవాది లలితాచండి (హైదరాబాద్), రాజి తెలగ (అమెరికా), అరవింద పార్నండి (లండన్), హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు, "జైహింద్" రేడియో నిర్వాహకురాలు జయ పీసుపాటి, రచయిత్రి డాక్టర్ సగిలి సుధారాణి, కవి గుత్తా హరిసర్వోత్తమ నాయుడు తదితరులు మాట్లాడారు. ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర (హైదరాబాద్) మాట్లాడుతూ, సమాజ ఉత్పత్తిలో భారతీయ మహిళ పాత్ర కీలకమన్నారు. "పహిలం బిడ్డా, జర పహిలం" శీర్షికతో స్ఫూర్తిదాయకమైన కవితను వినిపించారు. తెలంగాణ అటవీశాఖ సహాయ కన్సర్వేటర్ దేవనపల్లి వీణావాణి స్వీయ కవితాగానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ త్రివేణి వంగరి, వాసిరెడ్డి భవాని, డాక్టర్ ఉమ, డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద, రాధిక మంగిపూడి, ఇవటూరి జగదాంబ సుబ్రహ్మణ్యం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యదర్శి ప్రసాద్, రాఘవరావు, ఆర్. సుందరరావు, లలిత, అలివేలుమంగ, బెంగళూరు లక్ష్మి, లత, బుధారం రేణుక, కిడాంబి శ్రావణి, బాలాంత్రపు లావణ్య, విశ్వైక, కళావతి, శ్యామల, యజ్ఞనారాయణ, రత్నాల సృజన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com