తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే తన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. హక్కుగా రావాల్సిన నీటికోసం సీఎం ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని నిలదీశారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ “ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనలో అయోమయం నెలకొంది. ప్రజా సమస్యల పరిష్కరంపై నిజాయతీ కనిపించడంలేదు. ఒకవైపు సొంత కుటుంబంలోని వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడి మంత్రులు మరోలా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారో చెప్పాలి. మా అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు త్వరలోనే నీటిపారుదల నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేస్తాం” అని వివరించారు. పార్టీల వారీగా రైతుల విభజన వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు పచ్చి మోసమని మనోహర్ ధ్వజమెత్తారు. వాలంటీర్ల ద్వారా రైతుల్ని పార్టీల వారీగా విభజించి, మద్దతు ధరకు జొన్నల కొనుగోలులో వైకాపా నాయకులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్తులో నాలుగు గంటలు కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో జనసేన కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. తెనాలి మండలం ఎరుకలపూడిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన నాయకుడు పసుపులేటి శివదుర్గావరప్రసాద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన బీమాపథకం ద్వారా రూ.5లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందించారు.