నెల్లూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 225వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ మసీదు సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం కోసం సుదీర్ఘంగా చేసిన పాదయాత్రలో చెప్పిన మాటలన్నీ అసత్యాలే అని సీఎం జగన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారని అన్నారు. పాదయాత్రలో వెళ్ళిన ప్రతి చోట వృద్ధులను ఉద్దేశించి వారి సొంత కొడుకు చూసుకోకపోయినా తాను చూసుకుంటానని 3వేల రూపాయల పింఛన్ ఇస్తామని తెలిపారని కానీ నేడు కాలయముడులా మారి రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షలకు పైగా పింఛన్లు తొలగించారని, జిల్లాలో లక్షకు పైగా పింఛన్లు తొలగించారని, ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే 5వేలకు పైగా పింఛన్లను తొలగించారని అన్నారు. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్ అనేది సామాజికంగా భద్రత కల్పిస్తుందని, కన్నబిడ్డలు చూసుకోకపోయినా ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పిస్తుందని, కానీ నేడు వైసీపీ ప్రభుత్వం కుటుంబ సభ్యుల ఆదాయాలను, కరెంట్ బిల్లులను, వాహనాలను లెక్కగట్టి అవ్వాతాతలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు పింఛన్ తొలగించారని, ఇదేనా కన్నబిడ్డలు చూసుకోకపోయినా తాను చూసుకుంటానని చెప్పిన మాటకు అర్థం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.