ఏలూరు ( జనస్వరం ) : సీఎం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నాడని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లు నిర్మించి పేదల సొంత ఇంటి కల నెరవేర్చామని సామర్లకోట బహిరంగ సభలో జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోణంగి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను రెడ్డి అప్పలనాయుడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరులో 21948 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నచందంగా నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారునికి అందజేయలేదన్నారు. సొంతంగా 220 మంది లబ్ధిదారులు వారి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తుందని, లబ్ధిదారుల నుంచి రూపాయి కూడా వసూలు చేసే ప్రసక్తే లేదని ఎన్నికల్లో చెప్పిన ఆళ్ల నాని డ్వాక్రా మహిళల నుంచి దౌర్జన్యంగా డబ్బు వసూలు చేశారన్నారు. ఒక్కొక్క డ్వాక్రా మహిళల నుంచి 35 వేల రూపాయలు చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసి ఇళ్ల నిర్మాణాలు మాత్రం ప్రారంభించలేదన్నారు. డ్వాక్రా మహిళలను అప్పులు ఊపులోకి నెట్టివేశారన్నారు.
2006 నుండి 2009 వరకు నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ కే మళ్లీ జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఎమ్మెల్యే నానిని రెడ్డి అప్పలనాయుడు ప్రశ్నించారు. చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా ఏలూరు నియోజవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇందిరమ్మ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఎమ్మెల్యే ఆళ్ళ నాన్ని ఉన్నారని ఆరోపించారు. అనుచరులకు మాత్రం అక్రమ మార్గంలో దోచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లుగా కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజవర్గంలో మొత్తం 21948 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, పోణంగిగిలో 5552, కొమడివోలులో 7652, లక్ష్మీపురంలో 4334, చొదిమెళ్ళలో 4410 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారన్నారు. వీటిలో ఫైల్స్ వర్క్ చేసింది 987, ప్రింత్ భీమ్ వర్క్ జరిగినవి 5728, బేస్మెంట్, గ్రావెల్ తో వర్క్ జరిగినవి 4911, లింథెల్ లెవెల్ వర్కు తలుపులు కిటికీలతో 119, రూఫ్ లెఫిల్ స్లాబ్ లెవెల్ దశలో 349 ఉన్నాయని, ఒక్క ఇంటికి కూడా ప్లాస్టింగ్ చేయలేదన్నారు. 7658 గృహాలను ఇంకా మొదలుపెట్టలేదన్నారు. ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించి లబ్ధిదారునికి ఇవ్వలేదన్నారు. తూతూ మంత్రంగా జరుగుతున్న నిర్మాణాలు కూడా నాణ్యతలేని నాసిరకమైన భారతి సిమెంటు, జగనన్న ఇసుకతో జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని అనుమతితోనే ఆయన అనుచరులు లబ్ధిదారుల నుంచి దోచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రజల నుంచి దోచుకున్న మొత్తాన్ని బయట పెట్టి ప్రజల సమక్షంలో కక్కిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.