దేశానికి వెన్నుముక రైతు అయితే , దేశానికి గుండె దేశ పౌరులని తెలుసుకోవాలి. దేశం అభివృద్ధి చెందటమంటే పౌరులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే. దేశపౌరులంటే ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరు. పన్నులు కట్టడం, ఓటు వెయ్యడం మాత్రం చేస్తే బాధ్యతగా వున్నట్టు కాదు. ఒక్కరోజు జేబు పైన జండా పెట్టుకుంటేనో, తల ఎత్తి జండా వందనం చేస్తేనో, దేశభక్తి గీతం వస్తే నిలబడితేనో, దేశం మీద ప్రేమ, భక్తి, గౌరవం వున్నట్టు కాదు. ప్రతి ఒక్కరు భాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా వుండాలి. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగదో చూద్దాం.
మొదటిగా ఇంటి బాధ్యత :
ఇల్లు, బావుంటేనే ఊరు బాగుంటుంది. ఊరు, జిల్లా, రాష్ట్రాలు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే బాధ్యత ఇంటి నుంచే మొదలవ్వాలి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. చదువు శ్రద్ధతో చదువుకోవాలి. సొంతకాళ్ళ మీద నిలబడాలి, మీ ఇంటికి మీరు అండగా వుండాలి. సంస్కరం, గౌరవం, దయ ఇంటి వాతావరణంలో వుండేలాగ చూడాలి, మీరు వుండాలి. మీఇంటిని, ఇంటి సభ్యులలో ఆత్మీయత, అనురాగం, సాటివారికి ఆదర్శంగా నిలవాలి. అందరూ ఒక్కటే. ఏ కులమైనా, మతమైనా అనే ఆలోచన ఇంటిలోనుంచే, చిన్నవయసు నుంచి తెలిసేలాగ చెయ్యాలి. ఇంటి ఆనందం, మీ ఆనందం, మీ బాధ్యతగా తీసుకుంటే , దేశానికి మేలు చేసినట్టే.
“ ఒక సత్కార్యాన్నో, ఘనకార్యన్నో, నువ్వు చెయ్యాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింత నీకు వుందకూడదు.”
– స్వామి వివేకానంద
దేహ బాధ్యత – దేహ బలం :
ఆరోగ్యం లేని జీవితం వ్యర్ధం. సాటివారికి సాయం చెయ్యాలనే కాంక్ష ఆరోగ్యమైన శరీరం వున్నవారు చెయ్యగలరు. సహజ వనరులను, ప్రకృతి పచ్చదనంలో జీవించటానికి ప్రయత్నాలు చెయ్యాలి. పోషకాలతో కూడిన ఆహారం, శారీరక వ్యాయామం, యోగా, ధ్యానం, రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని బాధ్యతగా చూసుకుంటే, పనిలోని శ్రమకు అలసట వుండదు . చురుకగా ఆలోచనలు చేస్తారు.మీరు ఆరోగ్యం వుంటే, ఇతరులకు ఆరోగ్యం ముఖ్యమైనది అని అందరికీ చెప్పగలుగుతారు. సంపద ఎంత సంపాదించినా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకరికి సాయం చేస్తే వచ్చే తృప్తి నుంచి వచ్చేది ఆరోగ్యమే. మన ఆరోగ్య బాధ్యత మనం తీసుకుంటూ, ఇతరులకు ఆరోగ్యంగా వుండటానికి పౌష్టికాహారం, వాటిలో పోషకాలు, వాటివల్ల లాభాలు, శారీరక వ్యాయమాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుపుతూ, ఆరోగ్యం ప్రధమ భాద్యత అని తెలుకునేలాగా చెయ్యాలి.మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యాన్ని నాశనం చేసే దురలవాట్లకు చేరువు కాకుండా మనల్ని మనమే నియంత్రించుకోవాలి. మన ఆరోగ్యంగా, ఉంటేనే సమాజంలో జరిగే తప్పొప్పులని ఎదురించ వచ్చు. సమస్యలకు పరిష్కారం చూడవచ్చు.
“ బుద్ధిని ఉన్నత విషయాలతో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకొండి. రేయింబవళ్ళు
వాటినే స్మరించండి. అప్పుడే అద్బుతాలు, అవకాశాలు సాధించగలరు.”
మనోబలం :
దేహబలంతో మనోబలం తోడైతే ఆదర్శాలను అశయాలను అవలీలగా సాధించగలరు. పూర్వం దేశరక్షణ కోసం ఆయుధం చేత పట్టారు. నేటి కాలంలో మనో ధైర్యమే పదునైన ఆయుధం. మనోబలమే అసలైన బలం. పోరాటం చెయ్యటమంటే కత్తులతో చేసే కాలం కాదు. కానీ, ఇప్పుడు పోరాటం అంతా అంతరంగంతో చెయ్యాలి. సమస్య మీద గళం ఎత్తాలంటే ఎన్నో కత్తుల్లాంటి మాటలు గుచ్చుకుంటాయి. వాటిని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని సమకూర్చుకోవాలి. సమస్యకు పరిష్కారం దొరికే వరకు, పట్టుదలతో, సంకల్పం నెరవేరాలంటే మనోబలంతోనే సాధ్యం. విషయ పరిజ్ఞానం పెంచుకుని, మనోనిబ్బరంతో ఎదుటవారి వాక్దాటికి నిలబడి సమాధానం చెప్పేలాగ వుండాలి. వీలైనన్ని పుస్తకాలు చదవాలి. ప్రేరణ కలిగించే పలు కార్యక్రమాలు వీక్షించాలి. సమస్యలకు పరిష్కారం తెలిపే అంశాలను తెలుసుకొవాలి.మనోధైర్యాన్ని కొందరికైనా నింపే ప్రయత్నం చెయ్యాలి. మనసును చూపేది మాటతీరు అంటారు. అందరిలో వున్నప్పుడు ఖచ్చితంగా మాటలతో మర్యాద పలకాలి. మనోధైర్యంతో స్పందించే వారే దేశ అభివృద్ధికి సమిధలవుతారు. స్పందన ఎప్పుడూ సమస్య మీదనే చెయ్యాలి. మనోబలంతో చేసే పనులు మహత్తరమైనవి.
“ మనస్సు ఎంత స్వచ్ఛంగా వుంటే, దానిని నిగ్రహించాలంటే పవిత్ర తప్పనిసరి.
సంపూర్ణ మనో నిగ్రహానికి ఖచ్చితమైన నైతిక వర్తనమే సర్వస్వం.”
సమాజంలో పాత్ర :
ఇల్లు, శరీరం, మనసు బాగుంటే సమజానికి మనం ఇబ్బంది అవ్వము. కానీ, సమాజ పురోగతికి మన బాధ్యతగా ఏమి తీసుకోలేదని గుర్తించాలి. పక్కన నివసించే వారితో, సఖ్యతగా మెలగాలి. రోడ్లు, నీరు, కరెంటు, పచ్చదనం అందరితో కలిసి, అందరిని కలుపుకొని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి.సమస్యను గుర్తించడం, విధిగా ఒకటి, రెండు సార్లు ప్రయత్నించి వదిలెయ్యటం కాదు.సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణంఅదే. సమస్యను పట్టుదలతో, సహనంతో పరిష్కరించాలి. మన సమస్య కోసం మనం బాధ్యత తీసుకోకపోతే వేర్వేరు బాధ్యులు కారు. మనమే బాధితులం అవుతాం. పనిచేసే చోట జీతాల ఆరాటం కోసం మాత్రమే కాదు, హక్కుల కోసం కూడా పోరాడాలి. సంస్థల తప్పులు, లోపాలు, మోసాలు, గుర్తించాలి. ప్రశ్నించాలి…
న్యాయపరమైన చర్యలు అందరితో కలిసి ఫిర్యాదులు చెయ్యాలి. నిత్యావసర వస్తువులవస్తువుల నాణ్యతను, నిత్యం పరీక్షించడం. ప్రతి విభాగంలో, ప్రతి వస్తువు యొక్క నాణ్యత, నైపుణ్యాల లోపల మీద ప్రశ్నలు సంధించాలి. సమాజానికి సంబంధించిన పని మీతో మొదలైనా, మీరు ఒక్కరే చెయ్యాలి అనుకోకూడదు. సమాజంలో మీరు ఒంటరి కాదు. సమాజం మీ ఒక్కరిది కాదు. అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసి ప్రశ్నించడం అయినా, పోరాటం అయినా చేయాలి. ఇంటి తరవాత ఇంటి చుట్టు ప్రక్కల సమస్యలు తెలుసుకోవాలి. అన్ని చెయ్యాలి అనే అవేశం కాకుండా, ఆలోచనతో ఒక్కో సమస్య తీసుకొవాలి. పెద్దవారి సలహాలు, సూచనలను తీసుకుని అధికారులను సంప్రదించి, సాను కులంగా సమస్యను తెలియజేయాలి. సఖ్యతతో కూడిన పనులు సకాలంలో చెయ్యగలరు. కొందరి యువకులను, ఉత్సాహవంతులను సంప్రదించడం, వారితో కలిసి పనులు చెయ్యాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సాటి వారిని పాటించేలాగా సానుకూలంగా చెప్పాలి. బయట కనిపించే సమస్యలకు స్పందించడం, అయా సంస్థలకు ఫిర్యాదులు చెయ్యగలగాలి. సహచరులకు, స్నేహితులకు భాధ్యతను గుర్తుచేస్తు వుండాలి. సమాజంలో నేరుగా ముడిపడిన సమస్యలకు అందరిని కలుపు కుంటూ, కలిసి స్పందించడం చాలా ముఖ్యం. ప్రకృతి వనరులను కాపాడే ప్రయత్నాలు, వాటిపైన విశ్లేషణలు ఆవశ్యకత అవసరం.ప్రకృతిని కాపాడుకుంటే, జీవనాన్ని కాపాడినట్టే.
సామాజిక మాధ్యమాలలో భాధ్యత :
నేడు సామాజిక మాధ్యమం చాలా కీలకపాత్ర పొషిస్తుంది. ఇక్కడ ఎంత దుష్ప్రచారం జరుగుతుందో, అంతకన్నా ఎక్కువ మంచి విషయాలు తెలుస్తున్నాయి. సమస్యలు, ఎక్కువ విషయాలు ఇక్కడ త్వరగా తెలుసుకోవచ్చు. తీర్చే పరిష్కారాలు పొందవచ్చు. ఈ మాధ్యమం ఎంత మంచిగా ఉపయోగిస్తే, అంతా మంచి ఫలితాలు చూడగలరు. ఇక్కడ స్పందించే విధానం, విషయ జ్ఞానం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రత్యర్ధి వ్యంగ్య వ్యాఖ్యానానికి సహనంతో కూడిన బాధ్యతాయుతమైన బాష వాడగలిగితే చాలు.అదే మీ మాటకు, వ్యక్తిత్వానికి విలువ.భాధ్యత గల పౌరుడి స్పందన. సమయాలకు పరిష్కారాలు, పరిష్కార మార్గాలు ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు. సహాయం, సానుభూతి ఇక్కడ మెండు. మాధ్యమం ఉపయోగించుకుంటూ, బయట జరిగే అన్యాయాల మీద, నాణ్యతా ప్రమాణాల మీద, హక్కుల ఉల్లంఘన మీద స్పందించటం వల్ల ఎక్కువ మందికి తక్కువ సమయంలో తెలియచేయవచ్చు. సమస్య తీవ్రత తెలియజేయవచ్చు. దుర్బాషాలకు, దూషణలకు దూరంగా వుంటూ, విషయజ్ఞానం పెంచుకోవాలి. పంచుకోవాలి. సలహాలు, సూచనలు స్వాగతించాలి. మనోబలంతో సమస్యలపై ప్రశ్నలను సంధించాలి. ఇక్కడ సన్నిహితులు, ఒకే ఊరి వారైతే, వారాంతాలు, మాసానికి ఒక్కసారి కలుసుకుని సమస్యలపై చర్చ, పరిష్కార మార్గాలు చేస్తుంటే ఎన్నో అభివృద్ధి పనులు చెయ్యగలరు.
దేశాభివృద్ది, దేశపౌరుల ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలతో ముడిపడి వున్నాయి.దేశ సంక్షేమం కోరుకోవడం, ఆవేదన చెందటం, అన్యాయల మీద వ్యతిరేకత చూపడం మాత్రమే కాదు. పౌరుడిగా బాధ్యతలను నిర్వహించాలి.ఇంటిని భాధ్యతగా తీసుకుంటే ఇల్లు చక్కబడుతుంది. ప్రాంతాన్ని తీసుకుంటే ప్రాంతం బాగుపడుతుంది. ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల సమూహమే దేశమంటే. ఇంటి భాధ్యత ఒక్క ఇంటికి ఆనందం. దేశం బాధ్యత ఎన్నో ఇళ్ళకు అవసరం. దేశ బాధ్యత తీసుకున్న వారికి తృప్తి. అభివృద్దిలో ఎవరివంతు వారు కృషి చెయ్యాలి. దేశం అందరిదీ. బాధ్యత అందరికీ.దేశ భవిష్యత్తు మన అందరి చేతుల్లో, మనచేతిలో, నీ చేతిలో ఉంది. నీ బాధ్యత నువ్వు తీసుకో…
చట్టాల పై బాధ్యత :
దేశంలో చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, మన చట్టాలు అమలు చెయ్యటం లో జాప్యం, చట్టాల పై అవగాహన లోపం. చట్టాలు మీద అవగాహన చదువుకున్నవారు తెచ్చుకోవాలి. చట్టాలు ప్రాముఖ్యత సాధారణ ప్రజలకు తెలియజెయ్యాలి. చట్టాలను సక్రమంగా అమలు చేసే ప్రయత్నం అందరితో కలిసి చెయ్యాలి. నేటి వ్యవస్థకు చట్టం వల్లే ఎంతో న్యాయం జరుగుతుంది. చట్టాలను సరైన విధంగా అమలు చెయ్యటంలోనే మన వ్యవస్థలో మార్పు చూడవచ్చు. మార్పు కోరుకునే ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవించాలి, న్యాయంగా జీవించాలి.
నిన్నుగన్న అమ్మ ఋణం, అమ్మని గన్న భరతమాత ఋణం తీర్చుకో ఓ దేశపౌరుడా…
“ లక్ష్యం పై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్యసాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే.”
By
బడేటి. రాధిక
ట్విట్టర్ ఐడి : @BTelugammayi