శెట్టూరు, ఫిబ్రవరి 11, (జనస్వరం) : పుట్టిన ఊరిపై మమకారం చాటుకుంటూ మాకొడికి గ్రామానికి చెందిన చిరంజీవి పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సొంత గ్రామ అభివృద్ధిని మరవకుండా రూ.20,116 విరాళాన్ని అందజేశారు. శాసనసభ్యుడు అమిలినేని సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా పంపించారు. ఈ నిధులను పాఠశాల అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.
ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ బాల్య మిత్రుడైన చిరంజీవి, గ్రామ సేవా కార్యక్రమాలకు ప్రేరణ పొంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగం బెంగళూరులో ఉన్నా ప్రాణం ఊరిలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్ననాటి స్నేహితులు కలిసి గ్రామాభివృద్ధి, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం చేయూతనివ్వడం గ్రామస్థుల్లో హర్షం నింపింది. ట్రస్ట్ సభ్యులు, గ్రామ ప్రజలు చిరంజీవి చర్యను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.