● ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్
గుంటూరు, (జనస్వరం) : కాపుల్ని పవన్ కళ్యాణ్ గంపగుత్తగా చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెడుతున్నాడు అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు శనివారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. కాపు జాతిని అమ్ముడుపోయే జాతిగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు యావత్ కాపు జాతిని అవమానించేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలపై తక్షణమే ముఖ్యమంత్రి బేషరతుగా కాపు జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెంచల్ గూడా బ్యాచ్ రాసిచ్చే స్క్రిప్ట్ లో ఏది ఉంటే అది చదవటమేనా అని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దగ్గరనుంచి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వరకు కాపులపై చూపించేది అంతా కపటప్రేమేనన్నారు. రంగా హత్యకేసులో రాజశేఖర్ రెడ్డి చీకటి పాత్ర ఏమిటో బహిరంగ రహస్యమేనన్నారు. వంగవీటి రాధాని సైతం పార్టీలో నిరంతరం వేధించి బయటికి వెళ్లేలా కుట్ర పన్నింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. కాపులపై నిజంగా ప్రేమే ఉంటే అధికారంలోకి వచ్చిన అరక్షణంలోనే గత ప్రభుత్వం కాపులకు 5 శాతం కేటాయించిన ఈ డబ్ల్యు సీ రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేశావని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాను వియమ్మార్ జిల్లాగా ఎందుకు చేయలేదన్నారు. కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది, విదేశీ విద్య పథకాన్ని నీరు కార్చింది వాస్తవం కాదా అన్నారు. సంవత్సరానికి రెండు వేల కోట్లు కాపుల సంక్షేమానికి ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి కాపులకు 32 వేల కోట్లు ఇచ్చామంటూ కాకిలెక్కలు చెప్పటం కాపుల్ని నిలువెల్ల మోసం చేయటమేనని ధ్వజమెత్తారు. కాపుల సంక్షేమం కోసం వైసీపీ చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.