ఏపీ రాజకీయాల్లో సరిగ్గా ఐదేళ్ల కిందటి సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించించనుంది. మరోవైపు టీడీపీనే అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేసేందుకు వైసీపీ రెడీ అవుతోంది. ఏపీ రాజకీయాలకు ఢిల్లీ వేదిక కాబోతుంది. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో వేడుకల్లో వేడి పుట్టిస్తోన్న ఓట్ల తొలగింపు వ్యవహారంపై పోటాపోటీగా ఫిర్యాదులు చేసేందుకు టీడీపీ, వైసీపీలు రెడీ అవుతున్నాయి. వాలంటీర్ల సాయంతో టీడీపీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ గత కొద్ది నెలలుగా టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో 2021-22లో వేల సంఖ్యలో ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈసీ విచారణలో ఓట్ల తొలగింపు నిజమేనని తేలడంతో ఇద్దరు జడ్పీ సీఈఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన ఓట్ల జాబితాలను పరిశీలించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. 2023 జనవరి నుంచి తొలగించిన ప్రతి ఓటును పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టింది. అన్ని జిల్లాల్లో ర్యాండమ్‌గా ఓట్ల తనిఖీలు చేస్తోంది.
2018లో వైసీపీ సైతం ఇదే పద్ధతిలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసింది. ఓటర్ల జాబితాలో నాడు అధికారంలో ఉన్న టీడీపీ అక్రమాలకు పాల్పడిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో ఈసీ చర్యలు తీసుకుంది. సేవామిత్ర, బ్లూ ఫ్రాగ్ వంటి యాప్‌ల సాయంతో టీడీపీ నేతలు వైసీపీ అనుకూల ఓట్లను తొలగించిందని ఆరోపించారు. వైసీపీ చేసిన ఆందోళనలు ఫిర్యాదుల నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. 2018 చివర్లో ఎన్నికల సంఘం తరపున ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ఎన్నికల అధికారిగా విధుల్లో ఉన్న ఆర్పీ సిసోడియాను విధుల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న గోపాల కృష్ణ ద్వివేదిని ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు ఐఏఎస్ అధికారులు సుజాతరావు, వివేక్ యాదవ్, మార్కండేయులను అదనపు కమిషనర్లుగా నియమించింది.