ఏలూరు ( జనస్వరం ) : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో రాజ్యాంగం అమలు జరగడంలేదని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాల మీద దాడులు, విధ్వంసాలు, బెదిరింపులు, అదిరింపులు, కేసులు నిర్బంధాలతో జగన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు వద్దకు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లి జెడ్ కేటగిరి వారందరూ తిరస్కరించడంతో ఉదయం ఆరు గంటల వరకు వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డికి క్రియాశీలక సభ్యులైన సిఐడి బృందం వెళ్లి అరెస్టు చేసిందన్నారు. దీనిపై టిడిపి నాయకులు సిఐడిని ప్రశ్నించడం, ఆధారాలు చూపమనడం, లేదా 41 నోటీసు ఇవ్వాలని చెప్పినా ఖాతరు చేయలేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోను, అమరావతి రోడ్లు, భూసేకరంలో స్కాములు జరిగాయని అనేక రకాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో స్కాం జరిగిందని గతంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడును ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. ఆ తర్వాత ఏ విధమైన ప్రస్తావన లేకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఆధారాలు ఉంటే 41 నోటీసు ఇచ్చి కార్యాలయానికి రమ్మని, విచారణ చేయడం న్యాయబద్ధమైన ప్రక్రియ అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా 41 నోటీసు ఇచ్చి సిబిఐ వారు అనేక దఫాలుగా పిలిచి విచారించారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వద్దుకు వచ్చేసరికి సిఐడి నేరుగా వెళ్లి ఏ వన్ గా పెట్టి ముద్దాయిగా స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి మీరు చేశారని చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రజా, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే విధంగాను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని అతిక్రమించి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్టు జరిగిన సందర్భంలో ఏ పార్టీ అయినా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎవ్వరినీ రోడ్లమీదకు రాకుండా ఇళ్ల దగ్గరే నిర్బంధించడం, ఇళ్ల దగ్గర నుండి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లడమే కాకుండా బహిరంగంగా పార్టీ నాయకులు నోరెత్తే పరిస్థితి లేకుండా తస్మాత్ జాగ్రత్త మీరు గానీ రోడ్డు ఎక్కితే అరెస్టులు, వేధింపులు తప్పవని బెదిరింపులకు జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందన్నారు. ప్రజల స్వేచ్ఛను జగన్ రెడ్డి ప్రభుత్వం హరిస్తుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయని, జమిలి ఎన్నికలు జరుగుతాయని ఇతర ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే పరిస్థితులు లేకుండా చేయడానికి జగన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాంతియతంగా యువగళం పాదయాత్ర చేస్తుంటే వారి మీద వైసిపి రౌడీ మూకులతో దాడి చేయించారని, అంతకుముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకుందామని వైజాగ్ లో కార్యక్రమానికి వెలితే నిర్బంధించారని, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఇలా జగన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం విద్వాంసాలతో మొదలుపెట్టి చివరకు విధ్వంసాలు, అరెస్టులు, దౌర్జన్యాలు, అరాచకాలతో ముగింపు పలికే విధంగా ఉందన్నారు. గతంలో మద్దెలచెరువు సూరి బావ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి మర్డర్ చేశానని చెప్పాడని, ఈ రోజున మా బాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి సిఐడి పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, పోలీసు వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నేతలను కూడా ఒక రోజైన జైల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కార్యదర్శి సరిది రాజేష్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రావణ్ కుమార్ గుప్తా, నాయకులు బొత్స మధు, రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.