అమరావతి, (జనస్వరం) : కొన్ని నెలల క్రితం కొంతమందికి మాత్రమే తెలిసిన పేరు నేడు దేశమంతా మారుమోగుతుంది. ప్రముఖ కళాకారుడు శ్రీ కిన్నెర మొగులయ్య కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. గత కొంత కాలం నుండి తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మొగులయ్యను ప్రజలకు పరిచయం చేసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పరిచయం చేయడమే కాకుండా ఆయన ఆర్థిక పరిస్థితి బాలేదు అని తెలుసుకున్న జనసేనాని ఆర్థిక సహాయం సైతం అందించారు. ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు సహాయం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన శ్రీ మొగులయ్య గారు 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. కళాకారులను ఎల్లప్పుడూ ఆదుకునే పవన్ కళ్యాణ్ గారు మొగులయ్య కు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా బీమ్లా నాయక్ సినిమా నుండి విడుదలైన టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ పాట తో మొగులయ్య గారికి అనేక ప్రశంసలు లభించాయి. మొగులయ్య గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిలిశై సౌందరరాజన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు. ఈ సహాయం మరింత మందికి స్ఫూర్తినిస్తుంది అని కొనియాడారు.