• అప్పులతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు
• ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణ చూసి సీఎంకు భయం పట్టుకుంది
• అందుకే ఖైదీ నెం.6093 అవాకులు చవాకులు పేలుతున్నారు
• జనమే జగన్ కు గుండు గీయించే రోజు దగ్గరల్లోనే ఉంది
• విశాఖపట్నం మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు
విశాఖపట్నం, (జనస్వరం) : ప్రజల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణకు భయపడే సిబిఐ దత్తపుత్రుడయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే గడప గడపకు ప్రభుత్వం పేరుతో వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఛీకొడుతున్నారని చెప్పారు. నా వెంట్రుక కూడా పీకలేరని ప్రగాల్భాలు పలికిన ముఖ్యమంత్రికి ప్రజలే గుండు గీయించే రోజు దగ్గరల్లోనే ఉందని ఎద్దేవా చేశారు. శనివారం ఉదయం విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్యలతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ “నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఆ రోజు పాదయాత్ర చేయడం కాదు… దమ్ముంటే ఈ రోజు ప్రజల మధ్యకు రావాలి. కష్టపడి సంపాదించిన సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటుంటే అది చూసి ఓర్వలేక ఖైదీ నెంబర్ 6093 చంచల్ గూడ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. బలవన్మారణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు, అత్యాచారాలకు గురవుతున్న ఆడ బిడ్డల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు తప్ప… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా చంచల్ గూడ జైలుకో, సీబీఐకో దత్తపుత్రుడు కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి వాస్తవాలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు, మీడియా పై ఎదురుదాడులు చేయడం సిగ్గుచేటు.
• ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు :
ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రహదారి వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మన రాష్ట్రంలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. గజానికో గుంత, అడుగుకో గొయ్యలా మారాయి. జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి 36 నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు కూడా 36 కిలోమీటర్ల రోడ్లు కూడా వేయలేకపోయారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంథకారంలోకి నెట్టారు. జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల జీవనబృతిని దెబ్బతీశారు. మత్స్యకార భరోసా పేరిట రూ. 10 వేలు ఇచ్చి, నిత్యావసర వస్తువులు, డీజిల్ ధరలు పెంచి రూ. 30 వేలు వాళ్ల నుంచి లాగేస్తున్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు మానుకొని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని” హితవు పలికారు.
• వైఎస్ఆర్సీపీ కాదు వైఎస్ఆర్డీపీ అని పేరు మార్చుకోండి : బొలిశెట్టి సత్యనారాయణ
యువత, శ్రామికులు, రైతులకు ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని, వైఎస్ఆర్సీపీకి బదులు వైఎస్ఆర్డీపీ అని పేరు మార్చుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఎద్దేవా చేశారు. యువజన శ్రామిక రైతు ద్రోహం పార్టీ అని చెప్పాలన్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయన్నారు. ఉద్యోగాల కోసం యువత, సీఆర్పీసీ రద్దు కోసం ఉద్యోగులు నిలదీస్తున్నారన్నారు. చివరకు వాలంటీర్లు కూడా ప్రజలకు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇంకా వైసీపీ రెండేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. లోపాలను సరిదిద్దుకొనే ఆలోచనలో ఉన్నట్టు లేదన్నారు. ముద్దులు పెట్టి మోసం చేసి జగన్ రెడ్డిలా అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి దారి రహదారి. ఇప్పటికే కౌలు రైతులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో గుర్తించారు. వారికి సొంత డబ్బును రూ.లక్ష చొప్పున ఇస్తూ ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేస్తున్నారని తెలిపారు. ఈ వార్తను తొక్కిపెట్టాలని ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేసినా ప్రతి గ్రామంలోని రచ్చబండ దగ్గర పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతోందన్నారు. స్వతంత్ర్యం వచ్చాక మొట్టమొదటసారి ఒక నాయకుడు తన సొంత డబ్బులను రైతుల కోసం ఖర్చు చేస్తున్నాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో జనసేన పార్టీ జైత్రయాత్ర మొదలైందని, జనసేన ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
• ఆ హామీలు ఏమైయ్యాయి : టి. శివశంకర్
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఒక పార్టీ నాయకుడిలా మాట్లాడం సిగ్గు చేటని పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి భాష సరిదిద్దుకోవాలని, పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని హితవు పలికారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలు అమలు చేశామని గొప్పులు చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు… అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్ లో కేటాయిస్తామన్న రూ.1500 కోట్లు ఏమయ్యాయి? రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు ఆ హామీ ఏమైంది. సిపిఎస్ రద్దు హామీ ఎటుపోయింది? రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయి? మత్స్యకారులకు డీజిల్ పై సబ్సిడీ ఇస్తామన్నారు ఆ హామీ ఏమైందని నిలదీశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాక, మీకు తెలివొచ్చింది… వారికి నష్టపరిహారం ఇవ్వడం మొదలు పెట్టారన్నారు. మీ నవరత్నాలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించారని, అతి త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొన్నారు.