పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ శాఖలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై రాష్ట్రానికి ఒక గుర్తింపు ఇచ్చేది "రాజధాని" కానీ 72 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజధాని అనేది రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయింది. స్థిరమైన రాజధాని లేక దగా పడింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. స్వాతంత్ర్యానికి పూర్వం ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కారణంగా కొంతకాలం కర్నూలు రాజధానిగా ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి హైదరాబాద్ రాజధానిగా ఉంది. 2014 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 6 నెలల తర్వాత శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, అమరావతి అని పేరు నిర్ణయం జరిగింది. 2015 నుండి ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని కొరకు భూసేకరణ మొదలు పెట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాలనుండి 33 వేల ఎకరాల తమ సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు10 సంవత్సరాల పాటు పరిహారం ఇస్తామని, ప్రతి సంవత్సరం పరిహారాన్ని 10% పెంచుతామని ప్రభుత్వ వాగ్దానం చేసింది. 2015 అమరావతి రాజధానిగా శంకుస్థాపన ప్రధాని చేతుల మీదుగా జరిగింది. 2017 నుండి అమరావతి కేంద్రంగా తాత్కాలిక భవనాల్లో పరిపాలన మొదలు పెట్టారు.
2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అంటూ పరిపాలన వికేంద్రీకరణ కొరకు అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా 3 రాజధానులు అంటూ ప్రకటించింది. అమరావతి అభివృద్ధి కొరకు ఏర్పాటైన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(CRDA) బిల్లును రద్దు చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులు, అమరావతి ప్రాంతపు ప్రజలు వ్యతిరేకించి ఉద్యమం చేపట్టారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు తొలిదశలో ప్రభుత్వ శాసన ఉత్తర్వుల అమలుపై తాత్కాలిక నిరోధం విధించింది. విచారణ జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను రద్దు చేసి గత CRDA బిల్లును అమలులోకి తెచ్చే బిల్లును ఆమోదించింది. అదే సమయంలో త్వరలో లోపాలు లేని మూడు రాజధానుల మెరుగైన బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. 2022 మార్చి 3 నాడు ఉన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం, రాజధాని వికేంద్రీకరణ చెల్లదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, CRDAని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజ్యాంగ బద్దంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే, ఆ పనులను తప్పక చేయాలి అని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేస్తే “మాండమస్” అంటారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే ఉండే అత్యున్నత అధికారం ఇది. ఇలాంటి తీర్పులను కోర్టులు చాలా తక్కువ సందర్భాల్లో ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు మాత్రమే మాండమస్ తీర్పులు ఇస్తుంటాయి. ఇలాంటి తీర్పులు వస్తున్నాయి అంటే ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో, ప్రజా కంటక విధానాలు అమలు చేస్తున్నారో అర్ధం అవుతుంది.
భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయడానికి వేరే దారి లేదని హైకోర్టు తీర్పు ఇస్తే, ఇలాంటి తీర్పు ఇవ్వడం సరి కాదని న్యాయవ్యవస్థపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్పందించారు అంటే అమరావతి పై ఉన్న అయిష్టం, వ్యతిరేకతని అర్ధం చేసుకోవచ్చు. తీర్పు వచ్చి నెలలు గడుస్తున్నా ఏపీ ప్రభుత్వం నుండి 3 రాజధానుల పై ఎలాంటి స్పందన లేదు, అటు కోర్టు తీర్పును సవాల్ చేయలేదు. ఇటు కొత్త బిల్లు పెట్టే అవకాశం లేదు. ఏ విధంగా అయినా 3 రాజధానులకు ఎలాంటి చట్టబద్ధత వచ్చే అవకాశం లేదు.
అమరావతి నిర్మాణానికి రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతుల పక్షాన గొంతు వినిపించిందీ, ఒకే మాటపై నిలిచిందీ జనసేన పార్టీ మాత్రమే. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని వదులుకొని, మన హక్కుని కాదనుకుని వదిలి పారిపోయి మనకి అన్యాయం చేశారు అని మద్దతు ఇచ్చిన పార్టీని ప్రజా ప్రయోజనాల కోసం నిలదీసింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎన్నో ఒప్పందాలు, ఏవేవో కమిటీలు, విడిపోవటం, కలవడం, కలిసి విడిపోవటం. ఏది ఏమైనా రాజధాని ఎప్పుడూ మోసపోయి వంచించబడి దగా పడింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com