అనంతపురము, జనవరి 5 : డైరీ రాసే అలవాటుతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి అన్నారు. శ్రీవెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పలువురు విద్యార్థులకు డైరీలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ మాట్లాడుతూ, అనుభవాలను గుర్తు పెట్టుకోవాలంటే డైరీ రాయడం మంచి అలవాటన్నారు. నిద్రలో మనం చాలా విషయాల్ని మర్చిపోతుంటామని, డైరీ రాసే అలవాటు ఉన్నవారు నిద్రలో ఉన్నా సరే వారి జ్ఞాపకశక్తి బలంగా ఉంటుందన్నారు. డైరీ చాలామంది రాత్రివేళ పడుకునే ముందు రాస్తుంటారని, నిజానికి సాయంత్రం పూట డైరీ రాయడం మంచి సమయమని చెప్పారు. డైరీ రాయడం వల్ల ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుందన్నారు. ఒకరోజు డైరీ రాసినపుడు ఉన్న భావోద్వేగాలు తరువాత రోజు ఉండవన్నారు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వాటి ఎమోషన్స్ మన మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో మన డైరీలోని రాతలు మన కళ్లకు కడతాయన్నారు. కొన్ని విషయాల్లో మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి కూడా సాయపడుతుందన్నారు. చాలామంది జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మర్చిపోతుంటారని, డైరీ గతం మర్చిపోకుండా ఉంచుతుందన్నారు. డైరీ రాసే అలవాటు ఉన్నవారిలో భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉంటాయని, చేసిన తప్పులు, ఒప్పులు నోట్ చేసుకోవడం ద్వారా నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మనసు ఎటువంటి గందరగోళానికి గురవ్వకుండా ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలిగే ధైర్యాన్నిస్తుందన్నారు. సెల్ ఫోన్లతో గంటలు గంటలు సోషల్ మీడియాలో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. కాసేపు వాటిని పక్కన పెట్టి డైరీ రాయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా కొన్ని జ్ఞాపకాలను భద్రంగా దాచుకునే అవకాశం డైరీ రాయడం వల్లే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.