మట్టి మనిషినండి నేను... నా గోడు వినరండీ...
ఎందరో మహానుభావులు..అందరికీ వందనాలు.. వంద అణాలు కూడా కూడబెట్టుకోలేని నా రైతన్నకు శతకోటి వందనాలు… ప్రభువులు ప్రభుత్వాలు మారతాయి. నా రైతు బ్రతుకు మారదు. తన కాళ్ళకు పగుళ్ళైతే ఇసుమంతైనా పట్టించుకోని ఆ మట్టిమనిషి తన భూమిలో ఏర్పడిన పగుళ్ళకు గుండె బద్దలై ఆకాశం వైపు చూస్తాడు. తన ఒంట్లో పుండు పుడితే రవ్వంతైనా ఖాతరు చేయని గట్టిమనిషి. తన పంటకు పురుగు పడితే విలవిలలాడిపోతాడు. అంతకన్నా ఏం చేస్తాడు..అప్పు చేసి కొన్న విత్తనాలు నకిలీ, కడుపు మాడ్చి కొన్న పురుగుమందు నకిలీ, సర్కారు వారిచ్చే ఎరువు నకిలీ. ఈ నకిలీ జీవితాలలో తాను బ్రతకలేకున్నాడు.. ఎందుకంటే తాను బ్రతకనేర్చినవాడు కానే కాడు. నలుగురికి వండిన కూడేసేవాడే గానీ, డబ్బును కూడేసేవాడు కాదయ్యా మన రైతన్న. కుటుంబ పోషణ తలకు మించిన భారమని తెలిసి, రెక్కాడితే గానీ డొక్కాడదని తెలిసి, రోజూ కాయ కష్టం లోనే తన సుఖాన్ని వెతుక్కునే మన రైతు. తన భారాన్ని కుటుంబానికి కనబడనీయకుండా తన చిరునవ్వులతో కప్పేస్తాడు. తన శరీరంపై ఏర్పడ్డ గాయాలను మట్టితో కప్పేస్తాడు. సేదతీరే సమయం లేనివాడు రైతన్న. పట్టి మంచం ఎరుగడు, మట్టే తన మంచం, పచ్చగడ్డే పట్టుపరుపు.. పంటచేలో వచ్చే శబ్ధాలే తనకి జోలపాట.. తనకంటూ కోరికలేమున్నాయని, మేడలు మిద్దెలు కట్టాలనుకుండా? కార్లు విమానాల్లో తిరగాలనుకుంటాడా?? సమయానికి ఆకాశం వరుణించి, భూమాత కరుణించాలని కోరుకుంటాడు.. తన చేనుకిచ్చే విలువ తన మేనుకివ్వడు. ఎందరమో గొప్పవాళ్ళమయ్యాం. అందులో మన రైతన్నలు ఎందరున్నారు?? చిన్ననాటి నుండి కష్టపడి పైకొచ్చి స్ధిరపడ్డవాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి? రైతన్నకు ఆ స్ధిరత్వం ఏనాటికైనా దక్కుతుందా?? రైతును ఈ శాశ్వత అస్ధిరత్వం నుండి కాపాడేదెవరు? పల్లెటూళ్ళే పట్టుకొమ్మలు, రైతే వెన్నెముక.. ఈ నినాదం వచ్చాక ఎన్ని పల్లెలు పట్నాలయ్యాయో, ఎందరు రైతుల వెన్నెముకలు విరిగాయో? రైతే రాజు అని నా దేశం చాటి చెప్పింది.. కానీ, ఆ రాజు నిజానికి దాసుడు.. ఔను మన రైతన్న దాసుడు.. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ళకు దాసుకు దళారీల దోపిడీలను చెప్పుకోలేని బలహీనుడు.. ఒకవేళ పెదవి విప్పినా కడుపుకే చురకపడుతుంది..
పంట పండించడం ఒక కళ. కానీ తాను ఇది నా బాధ్యత అనుకుని చెయ్యడు. ఇది నా కర్తవ్యం అనుకుంటాడు. దళారీలు రైతన్నల దగ్గర బేరాలు పెడతారు, వారి చెప్పిన రేటుకు పంటను అమ్మకానికి ఇవ్వడం కుదరదు అని చెప్తే తన సరుకును కొనకుండా బయటే ఉంచేయడమో లేక వచ్చే ఏడు పంట కొనకపోవడమో చేస్తారు..తాత మరి కాస్త బెల్లం చందంగా మొత్తం తీస్కుని మాకేం తెలుసు.. ఇంకా మేము కాబట్టి మీకు సహాయంగా ఉన్నాయ అని అంటారు.. ప్రభుత్వాలు రైతులకిచ్చే మాటలు నీటి మీద రాతలు ఔతున్నాయి. నల్లనయ్య మన్ను తిన్నాక నోరు తెరవగా ఈ బ్రహ్మాండమంతా కనబడుతుంది.నిజానికి చిన్నికృష్ణుడు మట్టిలోనే సర్వం ఉందని చెప్పదలచాడేమో. అలాంటి మట్టిని నమ్ముకున్న రైతన్నకు మిగిలింది మట్టేనా? విదేశీ వ్యాపారులు కూడా మన దేశంలో ఎన్నో వ్యాపారాలు చేసి ధనవంతులయ్యారు.. ఇక్కడున్న మన రైతన్న ఇంకా రోజు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నాడు. మన తిండిని పండించే రైతన్న ఏనాడైనా మూడుపూటలా తినగలుగుతున్నాడా? స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా ఈ మట్టిననిషిని పట్టించుకున్నదెవరు?
తనకంటూ తగు సమయాన్ని కేటాయించుకోలేని దురదృష్టవంతుడు రైతన్న..నిత్యమూ ఎండలో ఎండినా, వానలో తడిసినా తన పాదాలకు ముళ్ళు ఎన్ని గుచ్చుకున్నా, కోత కోసేటపుడు చేతులకు ఎన్ని గాయాలైనా, ఇవన్నీ తనకు చాలా చిన్నవి. ఎందుకంటే తను పంట అనే తపస్సు చేస్తున్న యోగి పుంగవుడు. ఈ మట్టిమనిషి విలాసాల కులాసాలు ఎరుగడు.కళాశాలకు వెళ్ళిన వాడు కాదు. చదువు రాదని తనని తాను తిట్టుకుంటాడు. తన బిడ్డలకైనా చదువులు అబ్బాలని తాపత్రయ పడే మనిషి..
పొలాల నన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ అని మహానుభావుడు శ్రీశ్రీ గారు చెప్పిన కవితలను గొప్పగా చెప్పుకోవడమే గానీ, ఈ ధరిత్రిని పాదాలతో తాకి చాలా ఏళ్ళైంది.. మట్టి పాదానికి తాకితే అదేదో పాపమన్నట్టుగా, మట్టికి మన పాదానికి ఉన్న బంధాన్ని చెప్పులు ఏనాడో కప్పేశాయి.. అప్పుడే పుట్టిన శిశువు పాదాలను తల్లి ముద్దాడినట్టు, తన పాదాలను నిత్యం ముద్దాడుతుంది ఈ పుడమి తల్లి అని రైతన్నలు చెప్తారు. మనిషి నక్షత్ర మండలాలకు ప్రయాణం చేస్తున్నాడు, చంద్రమండలంలో భూములు ఇప్పుడే కొంటున్నాడు. కానీ, తాను నిలబడ్డ ప్రాంతంలో ఒకప్పుడు పంట సిరులు పండాయని, అది ఓ రైతన్న రెక్కల కష్టమని తెలుసుకోలేకపోతున్నాడు…
అయ్యా తాను అలా లేకపోతే మీ కడుపు నిండదని తెలుసుకోండి. నాటి మోతుబరుల దగ్గర నుంచి నేటి దళారుల వరకు ప్రతి ఒక్కరూ రైతు కష్టం మీద పైకొచ్చినవారే. అందుకే మన దేశంలో వైద్యుల పిల్లలు వైద్యులు, ఏ అర్హతా లేకపోయినా నాయకుల పిల్లలునాయకులు అవ్వాలనుకుంటున్నారు గానీ, రైతు బిడ్డలు రైతులుగా మారాలనుకోవడం లేదు. ఇందుకు చాలా కారణాలున్నాయి. వాటిని అధిగమించాలి రైతు అంటే చాల మందికి చులకన, వ్యవసాయం చేస్తున్నాను అంటే ఏ పనీ చేయడు అనే ముద్ర పడుతుందేమో అన్న భావన నేటి సమాజంలో బలంగా ఉంది. ఆ భావాన్ని సమూలంగా నాశనం చెయ్యాలి. వర్షాధార పంటలకు సరైన సమయంలో నీరందదు అనుకుంటారు. ప్రతి అర్హత గల రైతుకు మోటారు వేయిస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అవి తప్ప అన్యమైనవి ప్రచారం చేస్తున్నాయి. రైతులకు అవగాహన సదస్సులు ఏర్పరచి, వారిలో ధైర్యాన్ని చైతన్యాన్ని తీసుకురావాలి.
వ్యవసాయం మన పెద్ద చదువులలో పాఠ్యాంశాలుగా ఉన్నాయని ఎందరికి తెలుసు..రైతు బిడ్డలను ఈ దిశగా నడిపే ప్రయత్నం చేయాలి. రైతుగా బ్రతకడం ఒక అదృష్టమని జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి నాయకులు పాలేకర్ విధానాలను తెలుగు నేలకు పరిచయం చేసారు. ఆయన రైతుగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. జైకిసాన్ అంటూ ఎలుగెత్తారు. ఈ తరం యువత అపోహలను వీడి వ్యవసాయానికి గట్టి పునాది వేయాలి. మట్టి మనిషే గట్టి మనిషి అని నిరూపించాలి. మహాభారతంలో బలరాముని ఆయుధం నాగలి గా చెప్పబడింది.ద్వాపరయుగంలో స్వయంగా వ్యవసాయం చేయడం గొప్ప పనిగా భావించేవారు. యుగాలు మారినా భారతదేశంలో భూమాత పంట సిరులు కురిపించింది. పుట్టిన నాటి నుండి కడుపు నింపుకోవడమే గానీ దాచుకోవడం తెలియని అమాయకుడు మన రైతన్న.
లాక్ డౌన్ సమయంలో ఇంచుమించుగా అందరూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అని ఇంట వద్ద ఉంటూనే జాగ్రత్తగా సంపాదించుకున్నారు.వ్యాపారస్తులందరూ ఆన్ లైన్ బాట పట్టారు.సంపాదనా మార్గం పసిగట్టారు. మరి మన రైతన్నకు ఏదీ వర్క్ ఫ్రమ్ హోమ్. తను భూమికి పోకుంటే తనపైన అలుగుతుంది. అలుపన్నది లేకుండా కష్టపడితేనే పెట్టిన పెట్టుబడి కన్నా కొంతైనా లాభం ఉండేది. గుడికి వెళ్ళిన ఎవరైనా దేవుడా రైతు బాగుండాలి, అతనికి పంటలు బాగా పండాలి, వర్షాలు సమయానికి కురవాలి అని ఏనాడైనా కోరుకున్నారా? ఒకవేళ లేకపోతే ఇకనుంచి రైతు గురించి కూడా కోరుకోండి. మకుటాలు లేని మహారాజులైన రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. తనకు చదువు లేకపోవచ్చు, కానీ తనకు చేతిలో మంచి విద్య ఉంది. బీడు భూమిలో కూడా బంగారం పండించేంత విద్య ఉంది. విద్యయే యశస్సు, భోగకరి అని ఓ మహాకవి అన్నాడు. ఆ విషయం లో రైతుకు యశస్సూ లేదు, భోగవిలాసాలకు సమయమూ లేదు. తెలంగాణ గడ్డపై గద్దరన్న, అందెశ్రీ, సిక్కోలు సింగడు వంగపండు వంటి వారు రైతుల గూర్చి వారి సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం కొంత చైతన్యం తీసుకొచ్చారు. గుహుడిని గుండెల్లో పెట్టుకున్న రాముడిగానో, కుచేలుని వెతలు రూపు మాపిన శ్రీకృష్ణునిగానో వచ్చి రైతుల కష్టాలను తెలగించగలిగితే ఎంత బాగుంటుంది. ఈ కరోనా విపత్తును రైతన్న ఎదుర్కొని, సంపూర్ణ పూర్వ మానవుని గా మారాలని ఆకాంక్షిస్తున్నా.గుడిలో ఏముందీ, బడిలో ఏముందీ అని ఆ రెండిటి గొప్పతనాన్నీ ఓ గేయ రచయిత చక్కని పాటగా మలిచాడు. నారు మడిలో ఏమున్నదీ కూడా తెలుసుకుంటే మన కిరీటంలేని కిసాను రాజుల గురించి కూడా తెలుస్తుంది.
“ మకుటం లేని మహారాజైన మన రైతన్న ధరణీరధమును అధిరోహించి ఈ విశ్వాన్నే ఏలుతున్న నారాయణడి పదుకుండవ అవతారం ”
కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ఎటునుండి చదివినా ఒకే అక్షరమాల గల వికటకవి తరహా పద్యం మన రైతన్నలకు అంకితమిస్తున్నా..
// పైరూ చేలేలనే గమన తపన పతనమగ నేల లేచే రూపై //
// నగుమోము కనక నీవే నవ్వినవేనీ, కనకము మోగున?? //
// నాపయు చేనే గనేవా పండిగడింప వానేగ, నేచేయు పనా?? //
// దయచేయ దరిచేరి హలమే ధరణీరధ మేల హరిచేరి దయచేయద?? //
భావము:
మొదటి పాదం: పైరు చేను ఎందుకో నాలో అలజడిని, తపనను పోగొట్టడానికి అన్నట్టు, నేలే పైకి లేచిందా అన్నట్టుగా ఉంది
రెండవ పాదం: మా మొహములలో నవ్వు కనింపించటం లేదని నువ్వు నవ్వుతున్నావేమో...కంచు మోగినట్లు కనకము మోగదు కదా
మూడవ పాదం: నాపచేనయినా చూచినా, పంట పండి నీకు లాభం చేకూర్చేది వానే కానీ నీవూ నేనూ చేయగలమా
నాల్గవపాదం: నాగలి వచ్చీ రాగానే ఈ భూమిని చీల్చి పంటకు సాయం చేస్తుంది...అది స్వయంగా శ్రీకృష్ణుని చేరి వచ్చింది..
“ రైతును కాపాడుకుందాం,
దేశాన్ని కాపాడుకుందాం..”
జనస్వరం ద్వారా జనసర్వానికి రైతన్న విలువ తెలియజేయాలని నా ఈ చిన్న ప్రయత్నం.
BY
ఓ సత్యకాలపు కవి
ట్విట్టర్ ఐడి : @Mssatyasai
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com