హుజూర్‌నగర్, అక్టోబర్ 9 (జనస్వరం): హుజూర్‌నగర్‌లోని శ్రీ వాగ్దేవి హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో రూపొందించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పూల పండుగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరగడంతో పాటు వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తెలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జాల జ్యోతిబాబు, ప్రిన్సిపాల్ ఎన్. గంగాధర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
