దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేపట్టాలన్నా.. తద్వారా ధర్మపరిరక్షణ జరగాలన్నా.. రాష్ట్ర ప్రజలంతా ఏకమవ్వాలని జనసేనపార్టీ చంద్రగిరి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ దేవర మనోహర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ చంద్రగిరిలో జనసేన, బిజెపి నేతలు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం జనసేన, బిజెపి నాయకులు సంయుక్తంగా భారీర్యాలీ నిర్వహించి తహశీల్దార్ వినతిపత్రం అందజేశారు. జనసేనపార్టీ చంద్రగిరి నియోజకవర్గ కో- ఆర్డినేటర్ దేవర మనోహర్, బిజెపి ఇన్ చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడుల ఆధ్వర్యంలో గురువారం హిందూ దేవాలయాలపై వరుస దాడులకు వ్యతిరేకంగా భారీర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలోని శ్రీ కోదండ రామాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసనలతో హోరెత్తించారు. బైబిల్ ప్రభుత్వం వద్దు, హిందూ ప్రభుత్వం ముద్దు అంటూ నినదాలు చేశారు. భారత్ మాతాకి జై... హిందువుల వ్యతిరేక ప్రభుత్వం నశించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్, పురుషోత్తంనాయుడు ఇద్దరూ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మిత్రపక్షమైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న దేవాలయాలపై దాడులకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని పేర్కొన్నారు. జనసేనపార్టీ నాయకుల పట్ల, బిజెపి నాయకుల పట్ల పోలీసుల వైఖరి హేయమైనదని, అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం ఎంతో శోచనీయమన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాశీన వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ చిన్నవెంకటేశ్వర్లుకు జనసేన, బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల జనసేనపార్టీ నాయకులు గురు, వేణు, భాను, ముని, చరణ్, కిషోర్, గిరీష, హేమంత్, పవన్, వినోద్, జనసైనికులు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com