
ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు మండలంలో పెన్నా నది వరద ముంపుకు గురైన అప్పారావు పాలెం గ్రామాన్ని ఈరోజు స్థానిక జనసైనికులుతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ సందర్శించడం జరిగింది. గ్రామంలో పూర్తిగా ముంపుకు గురైన తూర్పు హరిజనవాడలోని ప్రజల కష్ట నష్టాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు సోమశిల రిజర్వాయర్ నుండి సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, సంగం ఆత్మకూరు, చేజర్ల మండలాల్లోని పెన్నా పరివాహక ప్రాంత గ్రామాలు ముంపుకు గురి కావడం జరిగింది. కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా సోమశిల జలాశయం ముందుభాగంలో సుమారు 30 అడుగుల గోతులు ఏర్పడి, ప్రధాన కట్టడానికి పెను ప్రమాదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన ఈ గోతులకు మరమ్మతులు చేపట్టి, పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, ప్రభుత్వం పనులు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా, నెల్లూరు నగరంతో సహా, పెన్నా పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం వెంటనే నీటి ముంపునకు గురైన గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించాలని, మరియు తక్షణ సాయంగా కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా పెన్నా నదీ పరివాహక వరద ముంపు కారణంగా దెబ్బతిన్న పంట పొలాలకు, చేపల చెరువులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. వరదలు వచ్చిన ప్రతిసారి ముంపునకు గురి కావడం, కష్టనష్టాలు అనుభవించడం, ప్రజలకు పరిపాటిగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పెన్నానది పొర్లు కట్టలను పటిష్టం చేయడం ద్వారా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.