ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రోజుకొక ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా, రెండవ రోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు స్థానిక జనసైనికులుతో కలిసి గత సంవత్సరం వరదల కారణంగా దెబ్బతిన్న, సోమశిల జలాశయానికి చెందిన ప్రాంతాన్ని వెంటనే మరమ్మతులు చేసి సోమశిల జలాశయం కాపాడవలసిందిగా సోమశిల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ప్రజల పాలిట ఆధునిక దేవాలయం మన సోమశిల జలాశయం. నెల్లూరు జిల్లాలోని అన్ని జలాశయాలతో కలిపి సుమారు180 టీఎంసీల నీటి నిల్వకు కారణమైన జలాశయం ఇది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రైతాంగం యొక్క సాగు, తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజానీకం యొక్క తాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్న, వరప్రదాయిని ఈ జలాశయం. ఇంతటి ప్రాముఖ్యత గల, ఈ అంతర్రాష్ట్ర జలాశయం ముందు భాగం గత సంవత్సరము వచ్చిన వరదల కారణంగా పూర్తిగా దెబ్బ తినడం జరిగింది. జనవరిలో సోమశిల జలాశయానికి సాంకేతిక కమిటీ పరిశీలించి, ఆగష్టు లోపల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది, కానీ పాలకుల అసమర్థత, అలసత్వం కారణంగా జలాశయం యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల నిర్లక్ష్యానికి ఈ మధ్యనే పులిచింతల గేట్లు తెగి జీవజలములు వృథాగా సముద్రం పాలుకావడం మాత్రమే కాకుండా, తీవ్రమైన నష్టం జరిగిన విషయం తెలిసినదే. గత వరదల కారణంగా సోమశిల ముందుభాగంలో ఏర్పడిన షుమారు 30 అడుగుల లోతు గుంటలు ఏర్పడ్డాయి. వీటి కారణంగా సోమశిల ప్రధాన కట్టడానికి పెను ప్రమాదం పొంచి ఉంది. వెంటనే పాలకులు తమ అలసత్వాన్ని వీడి మరమ్మతులను చేయని పక్షంలో, సోమశిల జలాశయం దిగువున అన్ని గ్రామాల ప్రజలకు పెను ముప్పు పొంచి ఉంది. ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితమే ప్రభుత్వాన్ని ఈ విషయమై హెచ్చరించడం జరిగింది. ఈ రోజు సోమశిల జలాశయం 85% నీటితో నిండినది. మరి కొద్ది రోజుల్లోనే జలాశయం నిండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే మరమత్తులు పూర్తి చేయాలని, జలాశయానికి రాబోయే పెను ముప్పు నుండి కాపాడాలని, జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులతో పాటు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పూసల మల్లేశ్వర రావు గారు తదితురులు పాల్గొన్నారు.