
నెల్లిమర్ల, జనవరి 10, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భోగాపురం, కోనాడ, ముక్కాం, రవాడ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను వివరించారు. భోగాపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామ రెవెన్యూ తూర్పు, పడమర ఖండాల్లో సాగులో ఉన్న పల్లం భూములను ఐటి పార్క్ కోసం ప్రైవేట్ సంస్థలకు కేటాయించవద్దని వినతిపత్రం సమర్పించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఈ భూములే తమ జీవనాధారమని, ప్రభుత్వం సేకరిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే, భోగాపురం రైతుల సమస్యను ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని, రైతులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోనాడ గ్రామ సర్పంచ్ బొడ్డు ఉదయ భారతి ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. కోనాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న ప్రభుత్వ సామాజిక భవనాన్ని జనవరి 8వ తేదీ రాత్రి కొందరు వ్యక్తులు జెసిబి ద్వారా అక్రమంగా కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఈ భవనాన్ని సుమారు పదేళ్లపాటు పాఠశాల తరగతి గదులుగా ఉపయోగించారని, ప్రస్తుతం కూడా ప్రభుత్వ అవసరాలకు వాడుతున్న భవనాన్ని ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు. సర్వే నంబర్ 34/2కు సంబంధించిన యజమానులపై అనుమానం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఇటీవల సముద్రపు ఉధృతికి ఫైబర్ పడవలు, ఇంజన్లు, వలలు కోల్పోయిన తమకు నష్టపరిహారం అందించాలని వినతి చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందేలా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే రవాడ గ్రామంలో సర్వే నెం. 64-1లో సాగులో ఉన్న రైతులకు సంబంధించిన ఆక్రమణలు, అనుభవదారుల వివరాలపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరగా, దీనిపై కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రజా దర్బార్‌లో వచ్చిన ప్రతి వినతిపత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హామీ ఇచ్చారు.