నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 157వ రోజున 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో నిర్వహించారు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజాసమస్యల అధ్యయనం చేసి అండగా ఉంటామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉంచగల నెల్లూరు పెన్నా బ్యారేజీ బ్యాక్ వాటర్ వల్ల పొర్లుకట్ట ప్రాంతానికి ముంపు సంభవించే అవకాశం ఉందన్నారు. ముప్పు తప్పాలంటే ఇక్కడ నది వెంబడి కరకట్ట నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో చిన్న రోడ్లు, కాలువలు కూడా బాగు చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని, ఇక కరకట్ట గురించి ఆలోచన కూడా చేయలేని పరిస్థితి అన్నారు. రానున్నది పవనన్న ప్రభుత్వమే అని, నెల్లూరు సిటీలో ప్రజల అపూర్వ అదరణతో గెలవబోతున్నామని, ఈ ప్రాంతంలో కరకట్ట నిర్మించే బాధ్యత తమదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.