కరోనాతో కళ చెదిరిన చేనేత ! చేనేతన్నకు కష్టకాలం : రేఖగౌడ్
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం చేనేతలను అన్నివిధాలుగా ఆదుకోవాలని లేకపోతే చేనేత కళనే కనుమరుగయ్యే ప్రమాదముందని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం రోజు ఎమ్మిగనూరు పట్టణములోని ఎస్,యం,టి కాలనీలోని చేనేత కార్మికుల సమస్యలను మరియు వారు చేస్తున్న చేనేత మగ్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రేఖగౌడ్ మాట్లాడుతూ వృత్తినే నమ్ముకొని కొనేళ్లుగా జీవనం చేస్తున్న వారికి కరోనా అల్లకల్లోలం లేపిందని నమ్ముకున్న వృత్తిని వదులుకొని బ్రతుకుజీవుడా అంటూ పొట్టకూటికోసం వ్యవసాయ కూలిపనులకు వెళుతున్నారని అన్నారు. కూలి పనులతో చేతులు మొద్దుబారి పట్టదారం చేతికి చిక్కడం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని నేత కార్మికుల జీవనాదారాన్ని అతలాకుతలం చేసిందని వారు తయారుచేసిన చీరలు అమ్ముకునే పరిస్థితి లేక కుటుంబాన్ని పస్తులు ఉంచలేక తరతరాలుగా వస్తున్న వృత్తిని విడి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారని చేనేతను కేవలం వ్యాపారంగా మాత్రమే చూడకుండా కళగా గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను గుర్తించి కరోనా సమయాల్లో 6 నెలలకు సంబంధించి ప్రత్యేకంగా నెలసరి వేతనంలా అందించాలని డిమాండ్ చేశారు.