వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కనుకనే మూడు రాజధానులు కడుతున్నారని, అదే చేత్తో పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులు లక్షల కోట్లు అడగటం లేదని, కష్టించి పండించిన పంటకు పరిహారం అడుగుతున్నారని అన్నారు. బుధవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నేలకొరిగిన పంటలను పరిశీలించారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ దగ్గర పర్యటన ముగించుకొని పెనుమూడి వంతెన మీదుగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు, రైతన్నలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లాలోని రేపల్లె, భట్టిప్రోలు, చావలి, నందివెలుగుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "అన్నం పెట్టిన రైతన్న కంట కన్నీరు రావడం రాష్ట్రానికి క్షేమం కాదు. ఈ ఏడాది మూడుసార్లు ప్రకృతి విపత్తులతో రైతులు పంటలు నష్టపోయారు. అప్పుల బాధ తాళలేక కడుపు మండి ఇవాళ కరోనాను సైతం లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వస్తున్నారు.
151 సీట్లు ఇస్తే... కనీసం పరామర్శించలేదు
వైసీపీ పాలనలో రైతులకు కనీస న్యాయం జరగడం లేదు. 151 సీట్లు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తే రైతులను పరామర్శించడానికి మంత్రులకు సమయం లేకుండా పోయింది. హైదరాబాద్ లో వరదలు వచ్చి ఇళ్లు మునిగితే బాధితులకు అక్కడి ప్రభుత్వం రూ. 10 వేలు చొప్పున నష్టపరిహారం అందించింది. ఇక్కడ ఎకరం పొలం మునిగితే ప్రభుత్వం అంతే ఇవ్వడం సరికాదు. నీట మునిగిన ఎకరా పంటకు రూ. 35 వేలు పరిహారం అందించాలి. తక్షణమే రూ. 10 వేలు రైతులకు అందించే ఏర్పాటు చేయాలి. అలాగే కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. పొలం యాజమానులతో సమానంగా వారికీ పరిహారం అందించాలి. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించాలి. రైతులకు పరిహారం పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం" అన్నారు.
రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "ప్రజాధనంతో నడిచే శాసనసభ ప్రజాసమస్యలపై కాకుండా అధికార, ప్రతిపక్షాలు తిట్టుకోవడానికి నడుపుతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు రోడ్డునపడితే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. పొలం యాజమానులతోపాటు కౌలు రైతులకు సమానంగా న్యాయం జరగకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. రైతులను ఏ విధంగా ఆదుకోవాలి అనే చర్చ కూడా లేదు" అన్నారు. రైతుల తరఫున గళం వినిపించేందుకు ఇంత మంది ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాసయాదవ్ పార్టీ కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నేతలు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ కమతం సాంబశివరావు, శ్రీ గాదె వెంకటేశ్వర రావు, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీమతి పార్వతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com